సినిమా ప్రారంభం రోజు నుంచే  వివాదాస్పదమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పి షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఈవిషయమై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే తెలుగు దేశం పార్టికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. 

దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. తొలి దశ పోలింగ్‌ (11-04-2019) పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదంటూ సెన్సార్‌ బోర్డ్‌ తనకు లెటర్‌ ఇచ్చినట్టుగా తెలిపిన వర్మ, ఈ పరిణామాలపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్టుగా వెల్లడించారు. సెన్సార్‌ బోర్డ్‌ తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం ఈ సినిమా రూపొందింది.