కరోన వైరస్‌ సినిమా పరిశ్రమను కుదిపేస్తోంది. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌లతో పాటు ఇతర సినిమా కార్యక్రమాలు ఆగిపోవటంతో వేలాది మంది కార్మికులు ఉపాది కోల్పోయారు. మరికొంత మంది లాక్‌ డౌన్‌ కారణంగా పలకరించే తోడు లేక డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ తారలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేసింది.

తాజాగా మరో మరణ వార్త కలవరం కలిగిస్తోంది. సినీ నిర్మాతగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అమెరికన్‌ ఫిలిం ప్రొడ్యూసర్‌ స్టీవ్‌ బింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌ సెంచరీ సిటీలో ఉన్న తన లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌లోని 27వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా తోడు లేకపోవటంతోనే స్టీవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

స్టీవ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిలో ఒకరు సినీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. స్టీవ్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీగా సంపాదించాడు. అదే సమయంలో తాత లియో ఎస్‌ బింగ్‌ ద్వారా 600 మిలియన్‌ డాలర్ల ఆస్తిని వారసత్వంగా పొందాడు. సినిమా నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ భారీగా సంపాదిస్తున్నాడు స్టీవ్‌. 2003లో రిలీజ్‌ అయిన కంగారూ జాక్‌ సినిమాకు రచయితగా పేరు తెచ్చుకున్నాడు స్టీవ్‌. ఆయన మృతితో హాలీవుడ్‌ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు.