మేము మేము బాగానే ఉంటాం.. మీరెందుకు తన్నుకుంటారు అనే డైలాగ్ దాదాపు స్టార్ హీరోలందరూ చాలాసార్లు వాడేశారు. ఈ డైలాగ్ వెనకున్న ఆవేదన అంతా ఇంతా కాదు. ఏ రంగంలో అయినా పోటీ ఉండకుండా ఉండదు. అయితే హీరోలు నువ్వా నేనా అనేంతలా ఉండరు కానీ అందరి సినిమాలు హిట్టవ్వాలని కోరుకోకపోయినా సినిమా నష్టపోకూడదు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. 

అయితే స్టార్ హీరోల అభిమానుల్లో కొంత మంది ప్రవర్తిస్తోన్న తీరు హద్దులు దాటుతోందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానం పేరుతో సోషల్ మీడియాలో గొడవలకు దిగుతున్నారు. కొన్ని గొడవలు బహిరంగంగా కూడా జరుగుతున్నాయి. ఇక గత కొంత కాలంగా RRR విషయంలో కూడా మెగా నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. 

ఈ సినిమా #NTR29 అని ఓ వైపు నందమూరి ఫ్యాన్స్.. కాదు #RC13 అని మెగా ఫ్యాన్స్ ఇంకోవైపు హడావుడి చేయసాగారు. అందుకే చిత్ర యూనిట్ బాగా అలోచించి #RRR అని వర్కింగ్ టైటిల్ ను సెట్ చేసింది. ఇక లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్ - రానా అలాగే రామ్ చరణ్ - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ వంటి అగ్ర హీరోలు హీరోలు ఒకే చోట కూర్చొని నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తుంటే.. మేమెంతా ఒకటే అని ఫ్యాన్స్ కు ఒక మంచి సందేశాన్ని తెలియకుండానే ఇచ్చేస్తున్నారని చెప్పవచ్చు. 

అందుకు సంబందించిన పోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది 'ఆగ్రహంతో ఆలోచించకుండా ఊగిపోయే అభిమానులకు చెంపపెట్టు' లాంటిదని' కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాలో రాజమౌళి ఎలాంటి స్క్రీన్ ప్లే తో హీరోలను చూపిస్తాడో అనే టెన్షన్ కన్నా ఇద్దరు హీరోల అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఎక్కువగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి జక్కన్న ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడాలంటే రెండేళ్లు ఆగాల్సిందే.