తమిళ బ్యూటీ శృతిహాసన్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. చాలా కాలంగా ఈ బ్యూటీ లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇద్దరి ఇళ్లల్లో కూడా వీరి ప్రేమ విషయం తెలుసు కానీ ఇప్పుడు ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మైకేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించాడు.. ''జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవసాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గానే మిగిలిపోతుంది. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను'' అంటూ రాసుకొచ్చాడు.

శృతితో దిగిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. మూడేళ్ల క్రితం ఓ కాన్సర్ట్ కోసం శృతి లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైకేల్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరు స్నేహితులుగా మారడం, అది ప్రేమగా మారడం జరిగాయి.

చివరకు ఈ జంట స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.