దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఆయన కోలుకుని కూడా చాలా రోజులవుతుంది. మూడు వారాల తర్వాత వైద్యుల సూచనల మేరకు ప్లాస్మా డొనేట్‌ చేస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ యోధుడిగా మారేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ, ప్లాస్మా దానం చేసే విషయంలో అనుమానాలు అక్కర్లేదని, కరోనాతో బాధపడుతున్న వారికి ప్లాస్మా అనేది బ్రహ్మాస్గ్రంగా పని చేస్తుంది. అందుకే ప్లాస్మాని దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతామని రాజమౌళి తెలిపారు. ప్లాస్మా దానం చేసిన వారు నిజమైన హీరోలని, తాము వెండితెరపై చాలా మంది హీరోలను చూస్తుంటాం. కానీ నిజమైన హీరోలు మీరే అని ప్లాస్మా దానం చేసే వారిని ఉద్దేశించి తెలిపారు. ప్లాస్మాతో ఒక ప్రాణం నిలుస్తుందని, అందుకే వారు నిజమైన యోధులన్నారు. 

 తాము కూడా హీరోలుగా మారాలనుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే తాను ప్లాస్మా దానం చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో తామ కూడా యోధులమవుతామన్నారు. ప్లాస్మా తీసినంత మాత్రన ఏమీ కాదని, తిరిగి అది మూడు రోజుల్లో వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానానికి సంబంధించి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేస్తున్న అవగాహన కార్యక్రమాలను రాజమౌళి అభినందించారు. పోలీసుల డ్యూటీలో ఇది భాగం కాకున్నా ఒక వేదిక ఏర్పాటు చేసి వాలంటీర్లని ఆహ్వానించి ప్లాస్మా డొనేషన్‌ను ప్రోత్సహిస్తున్నారని, వారు నిజంగా రక్షక భటుల్లాగా పనిచేస్తున్నారని కొనియాడారు.