నటి శ్రీరెడ్డి.. లక్ష్మీపార్వతిపై తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీపార్వతి పేరుతో రెండు బయోపిక్ లు రాబోతున్నాయి. ఒకటి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కాగా.. మరొకటి కేతిరెడ్డి రూపొందించనున్న 'లక్ష్మీస్ వీరగ్రంధం'. కేతిరెడ్డి సినిమాలో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి కనిపించనుంది. అయితే అందులో లక్ష్మీపార్వతిని ఎలా చూపించబోతున్నారని ఆమెని ప్రశ్నించగా.. ప్రతి మనిషిలో మంచి, చెడూ రెండూ ఉంటాయని, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని చెప్పింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీపార్వతి రాజకీయ లబ్ది కోసం ఆమెని పాజిటివ్ యాంగిల్ లో చూపిస్తున్నారని, కానీ కేతిరెడ్డి ఆమెలో నెగెటివ్ షేడ్స్ చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఈ రెండూ తప్పు కాదని అంది. ఎవరేం చెప్పినా..  అసలేం జరిగిందో జనాలకు తెలుసునని.. వాళ్లకు నచ్చితేనే సినిమాలు ఆడతాయని తెలిపింది. ఇక లక్ష్మీపార్వతిని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడింది. 

''ఎన్టీఆర్ గారు 1923లో పుట్టారు.. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగ్రంధం సుబ్బారావు గారు 1937లో పుట్టారు.. తనకంటే పెద్దవాడని కాపురం చేయలేకపోతున్నానని భర్తని, పదహారేళ్ల బిడ్డను వదిలేసింది లక్ష్మీపార్వతి. ఆవిడేం తల్లి అసలు..?'' అంటూ లక్ష్మీపార్వతిని టార్గెట్ చేసింది. వీరగ్రంధం గారి కంటే ఎన్టీఆర్ వయసులో ఇంకా పెద్దవాడని అతడితో లక్ష్మీపార్వతికి ఎలాంటి వ్యత్యాసాలు రాలేదా..?'' అంటూ ప్రశ్నించింది. 

''ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో ఒంటరైపోతే తనే దగ్గరుండి చూసుకున్నానని లక్ష్మీపార్వతి చెప్పేది.. మరి ఈమె వదిలేస్తే తన భర్త, పిల్లాడు ఒంటరి వాళ్లు కాలేదా..?'' అంటూ మండిపడింది.