రివ్యూ: శ్రీనివాస కళ్యాణం
ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఒకసారి చూసే సాహసం చేయొచ్చు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది ఓవర్సీస్ ఆడియన్స్. అక్కడ ఇలాంటి కథలకు చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తుంటుంది
నటీనటులు: నితిన్, రాశిఖన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, జయసుధ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
దర్శకత్వం: సతీష్ వేగ్నేశ
'శతమానం భవతి' సినిమాను రూపొందించిన నేషనల్ అవార్డు దక్కించుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేశ ఈసారి కూడా బంధాలు, బాంధవ్యాలు, పెళ్లి అనే కాన్సెప్ట్ తో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను రూపొందించారు. నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
చిన్నప్పటి నుండి తన నానమ్మ చెప్పే మాటలు వింటూ పెరుగుతాడు వాసు(నితిన్). ఉమ్మడి కుటుంబంలో పెరగడంతో ప్రతి విషయంలో పద్దతిగా ఉంటాడు వాసు. చండీఘర్ లో ఉద్యోగం చేసే సమయంలో అతడికి శ్రీ(రాశిఖన్నా)తో పరిచయం ఏర్పడుతుంది. వాసు ప్రవర్తన, పద్ధతులు నచ్చి శ్రీ అతడిని ప్రేమిస్తుంది. వాసు కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. హైదరాబాద్ లో పేరు గాంచిన వ్యాపారవేత్త ఆర్.కె(ప్రకాష్ రాజ్) చిన్నకూతురు శ్రీ. రిచ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన శ్రీకి వాసు కుటుంబం మీద కూడా మంచి ఒపీనియన్ ఉంటుంది. అదే విషయాన్ని తన తండ్రికి చెబుతుంది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ శ్రీ తండ్రి ఆర్.కె కి పెళ్లి, సాంప్రదాయాలంటే ఇష్టం ఉండదు. తన కూతురు ప్రేమించిందనే ఒక్క కారణంతో వాసుని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ పెళ్లికి ముందే వాసుని ఓ అగ్రిమెంట్ మీద సంతకం చేయమని అడుగుతాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి అయిన తరువాత విడిపోవాలని అనిపిస్తే ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదదు. ఇష్టం లేకపోయినా.. వాసు తన ప్రేమ మీద నమ్మకంతో ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. మరి ఆ అగ్రిమెంట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది..? శ్రీ, వాసులు ఒక్కటయ్యారా..? తమ పెళ్లితో ఇరు కుటుంబాలు సంతోషంగానే ఉన్నారా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
మొదట్నుంచీ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే బంధించేసి, చివర్లో ఎమోషనల్ అయ్యే ఫార్ములా 'బొమ్మరిల్లు' సినిమాలో బాగానే వర్కవుట్ అయింది. అప్పట్నుంచీ ఆ పాయింట్ ను బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏదీ బొమ్మరిల్లు కాలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ నుంచి గతేడాది వచ్చిన 'శతమానం భవతి' కూడా అలాంటి ఒక పతాక సన్నివేశపు ఎమోషనల్ కంటెంట్ మీద ఆధారపడిన కథే. ఇప్పుడు 'శ్రీనివాస కళ్యాణం' కథ కూడా అలానే సాగుతుంది. 'శతమానం భవతి' సినిమా పిల్లలు, తల్లితండ్రులు, కుటుంబం, ఆప్యాయతలను చూపిస్తే ఈ సినిమా కుటుంబం, బంధాలు, పెళ్లి దాని విలువ అనే అంశాలు చూపించారు. సింపుల్ లవ్ స్టోరీతో మొదలైన కథ పెళ్లితో ఎండ్ అవుతుంది. సినిమా ఆరంభ సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. హీరోయిన్ ప్రేమలో పడడం, హీరో కూడా ఆమె ప్రేమించే సీన్స్ పెద్దగా సాగదీయకుండా సింపుల్ గా కానిచ్చేశారు. సినిమాలో ఎక్కువగా పెళ్లిపై దృష్టి పెట్టాలని భావించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం పెళ్లి ఎలా జరగాలనే విషయాలనే చూపించాడు.
పూర్వకాలంలో ఎంత పద్దతిగా పెళ్లిళ్లు జరిగాయో చెప్పాలనుకొని చిన్న చిన్న పెళ్లి పనులను తెరపై చూపించేసి అదే ఒకప్పటి పెళ్లి అని చెప్పడం రుచించదు. పెళ్లికి ముందు విఘ్నేశ్వరుని పూజ చేయడం, గోధుమ రాయి పెట్టడం, పసుపు కొట్టడం వంటివి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సినిమాలో కూడా ఆ సన్నివేశాలనే తిప్పి తిప్పి చూపించారు. కాకపోతే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కథ సాగడం కొత్తదనాన్ని తీసుకొచ్చింది. పెళ్లి సెటప్ అంతా కూడా రెగ్యులర్ సినిమాల్లో చూపించినట్లుగానే ఉంది. పైగా కథలో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఉండవు. కథ సాగుతున్నంతసేపు చాలా బోరింగ్ గా అనిపిస్తుంటుంది. ప్రతిసారి హీరో క్యారెక్టర్ సీన్ లోకి ఎంటర్ అయి పెళ్లి దాని గొప్పతనం చెబుతుంటే ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం కాదు కదా.. ఏదో క్లాస్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం బాగున్నప్పటికీ తెరపై దాన్ని ఆవిష్కరించే విధానంలో తప్పులు దొర్లాయి. క్లైమాక్స్ లో హీరో పెళ్లి విలువ చెప్పే సన్నివేశాలు మరింత నీరసాన్ని తెప్పిస్తాయి.
ఎమోషనల్‌గా పండాల్సిన పతాక సన్నివేశంతేలిపోవడం, చివరి వరకు హోల్డ్ చేసే బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడంతో ఫైనల్‌గా ఒక సగటు సినిమా చూసిన అనుభూతినిస్తుందే తప్ప గుర్తుండిపోయే లక్షణాలు లేవు. ఇప్పటికే ఎన్నో ఫ్యామిలీ డ్రామాలు చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలో కొత్తగా చూడడానికి ఏమీ కనిపించదు. హీరోగా నితిన్ చక్కటి నటన కనబరిచాడు. సెటిల్డ్ గా ఉండే క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. కానీ అతడు చెప్పే డైలాగ్స్ కి ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. రాశిఖన్నా తెరపై చాలా అందంగా కనిపించింది. నితిన్, రాశిల జంట ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. హీరోయిన్ తండ్రిగా కీలకపాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. తన నటనతో మెప్పించారు. క్లైమాక్స్ లో ఆయన చెప్పే మాటలు ఎమోషనల్ గా అనిపిస్తాయి. సినిమాలో మొత్తంగా చూసుకుంటే హైలైట్ అయిన పాత్ర ప్రకాష్ రాజ్ దే. రాజేంద్రప్రసాద్, జయసుధ, సితార, నరేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నందిత శ్వేత, పూనమ్ ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.
ఈ చిత్రానికి సిసలైన హీరో మిక్కీ జె. మేయర్. తన నేపథ్య సంగీతంతో ఫీల్ పుట్టించిన మిక్కీ, ఆకట్టుకునే బాణీలు అందించాడు. మంచి సాహిత్యం కూడా కుదరడంతో అన్ని పాటలు వినడానికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా కలర్‌ఫుల్‌గా ఉండడంతో సినిమాకి అవే ప్రధానాకర్షణ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చిత్రాన్ని రిచ్‌గా తీర్చిదిద్దాయి. ఎమోషనల్‌గా కదిలించే మూమెంట్స్ క్రియేట్ చేయడంలో దర్శకుడు మూస పోకడలకి పోయాడే తప్ప ఒరిజినాలిటీ లోపించింది. ఇటువంటి సినిమాలు పండగల సమయంలో విడుదలైతే కాస్తో కూస్తో వర్కవుట్ అయ్యే ఛాన్స్ లు ఉండేవి. ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఒకసారి చూసే సాహసం చేయొచ్చు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది ఓవర్సీస్ ఆడియన్స్. అక్కడ ఇలాంటి కథలకు చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తుంటుంది. మరి ఈ 'శ్రీనివాస కళ్యాణం' అక్కడ ఎంతటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి!
రేటింగ్: 2.5/5