ఇటీవల దర్శకుడు, నటుడు శ్రీనివాస్‌ అవసరాల తనకి అన్యాయం చేశాడని, తనని బయటకు గెంటేశాడని ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి దుమారం రేపాడు కో డైరెక్టర్‌ మహేష్‌. దీంతో నిజంగానే శ్రీనివాస్‌ అవసరాల ఇంత దారుణం చేశాడా? అని అంతా అనుకున్నారు. అంతేకాదు అందులో ఆయన బట్టతల ఉన్నట్టు, అసలు గుట్టు చూపిస్తా చూడండి అంటూ క్యాప్‌ తీశాడు మహేష్‌. అయితే దీని వెనకాల ఉన్న సీక్రెట్‌ తెలిసిపోయింది. ఇదంతా తూచ్‌ అని చెప్పేశాడు. తమ సినిమా ప్రమోషన్‌ కోసం లీక్‌ చేసిన వీడియో ఇదని స్పష్టమైంది. 

దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్న శ్రీనివాస్‌ అవసరాల ప్రస్తుతం `101 జిల్లాల అందగాడు` చిత్రంలో నటిస్తున్నారు.  ఈచిత్ర ఫస్ట్ లుక్‌ని గురువారం విడుదల చేశారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుందని తాజాగా పోస్టర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో శ్రీనివాస్‌ అవసరాల బట్టతలతో కనిపించడం విశేషం. దీంతో ఇటీవల విడుదల చేసిన వీడియో కావాలని చేసిందే అని తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో హీరోకు బ‌ట్ట‌త‌ల ఉండ‌ట‌మనేది ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి క‌థాంశం. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో శ్రీనివాస్ అవసరాల గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయన పాత్రలో రెండో యాంగిల్స్ ఉంటాయని అర్థమవుతుంది. తను హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌ను కూడా అందించడం విశేషం. కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ స్టోరీని ఆయన రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్‌.  త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు. అలాగే మేలో 7న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.