బాలకృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `నర్తనశాల`. ఎన్టీఆర్‌ నటించిన `నర్తనశాల`కిది రీమేక్. కానీ కొన్ని అవాంతరాలతో ఈ సినిమా ఆగిపోయింది. షూట్‌ చేసిన సన్నివేశాలను కలిపి ఓ వీడియో రూపంలో విడుదల చేస్తున్నారు. 17 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేయగా, దానికి విశేషమైన స్పందన లభించింది. 

తాజాగా ఇందులో భీముడి పాత్రని పోషించిన శ్రీహరి లుక్‌ని విడుదల చేశారు. భీముడిగా శ్రీహరి కరెక్ట్ గా మ్యాచ్‌ అయ్యారు. ఆయన లుక్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. మరోసారి వెండితెరపై తమ అభిమాన నటుడుని చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అదే సమయంలో ఎమోషనల్‌ అవుతున్నారు.

ఇక శ్రీహరి కుటుంబ సభ్యులకు ఉండే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీహరి ఫస్ట్ లుక్‌ విడుదలవుతుందని తెలిసి శ్రీహరి కుమారుడు మేఘామ్ష్ శ్రీహరి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తెరపై నాన్నని చూడబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడిన శ్రీహరి 2013 అక్టోబర్ 9న కన్నుమూసిన విషయం తెలిసిందే.

సినిమాని ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. శ్రేయాస్‌ ఈటీలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్‌ అయ్యాయి. బాలకృష్ణ అభిమానులు భారీగా వెచ్చించి టికెట్‌ని కొనేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.