శ్రీదేవి సోదరి శ్రీలత భర్త సంజయ్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు

  • శ్రీదేవి మృతిపై ఇప్పటివరకు స్పందించని ఆమె సోదరి
  • శ్రీదేవి సోదరి శ్రీలతపై రకరకాల కథనాలు
  • తాజాగా సంచలన ప్రకటన విడుదల చేసిన శ్రీలత భర్త సంజయ్ రామస్వామి
sridevi sister srilatha husband sanjay ramaswamy sensational statement

ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న మరణించిన అనంతరం తిరుపతికి చెందిన ఆమె బంధువు వేణు గోపాల్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్రీదేవికి తాను బాబాయ్ అవుతానని చెప్పడంతో పాటు శ్రీదేవి చిన్న తనం నుండి ఎలా పెరిగింది, ఎలాంటి కష్టాలు పడింది అనే విషయాలు వెల్లడించారు. శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత, భర్త బోనీ కపూర్‌కు సంబంధించిన విషయాలతో పాటు శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీల గురించి తెలిపారు.

 

శ్రీదేవి మరణం అనంతరం ఆమె సోదరి శ్రీలత ఇప్పటి వరకు మీడియాకు కనిపించలేదు, ఎలాంటి స్టేట్మెంటు కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. శ్రీదేవి సోదరి శ్రీలతను వివాహం చేసుకుని 28 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల కాలంలో తాను వేణు గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఎప్పుడు కలవలేదని సంజయ్ రామస్వామి వెల్లడించారు. వేణు గోపాల్ రెడ్డి చెప్పిన ఏ విషయంలోనూ నిజం లేదని సంజయ్ తెలిపారు. శ్రీదేవి మరణంతో కుటుంబం మొత్తం శోక సముద్రంలో ఉంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఎలాంటి కామెంట్స్ వద్దని సంజయ్ రామస్వామి సూచించారు.

 

ఫ్యామిలీ మొత్తం బోనీ కపూర్ కు సపోర్టుగా ఉందని, ఇలాంటి సమయంలో తామంతా ఆయన వెంటే ఉన్నామని సంజయ్ తెలిపారు. మీడియాలోని కొన్ని వర్గాలు నా భార్య(శ్రీలత) నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తున్నాయి. అన్నిరకాల ఆరోపణలను ఆపాదించాయి. నా భార్య తన సోదరి పోగొట్టుకున్న బాధలో ఉంది. ఇలాంటి సయమంలో గోడమీద నిలబడి అరవమంటారా? మేమెంతగానో విచారిస్తున్నాం. అలాగని ఎలాంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించడం లేదు. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని సంజయ్ రామస్వామి సూచించారు.

 

మేము చాలా సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులం. శ్రీదేవి మాకు అందరికి ఒక ప్రేరణగా ఉండేది, కుటుంబంలోని అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు అని సంజయ్ రామస్వామి తెలిపారు. శ్రీదేవి మరణం అనంతరం ఇప్పటివరకు బయటకు రాని శ్రీదేవి సోదరి శ్రీలత, ఆమె భర్త సంజయ్ రామస్వామి... కేవలం తమపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకే తాజాగా మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios