బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు తొలుత శ్రీదేవిని అనుకున్న దర్శకనిర్మాతలు శ్రీదేవి అంగీకరించకపోవడం అదృష్టమన్న రాజమౌళి కమెంట్స్ పై స్పందించిన శ్రీదేవి రాజమౌళి తనపై చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్న అతిలోక సుందరి శ్రీదేవి

తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రంలోని శివగామి పాత్ర కోసం తొలుత శ్రీదేవిని సంప్రదించారు. కానీ కుదరక చివరకు ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. తొలుత రమ్యనే అనుకున్నా.. మార్కెట్ పెంచుకోవాలంటే శ్రీదేవి లాంటి నటి ఉంటే బాగుంటుందని ఆమెను స్పందించామని రాజమౌళి తెలిపాడు.

అయితే శ్రీదేవి డిమాండ్లు తట్టుకోలేకనే శివగామి పాత్రకు శ్రీదేవి కుదరలేదన్నారు రాజమౌళి. అంతటితో ఆగక.. శ్రీదేవి అంగీకరించకపోవడం తమ అదృష్టం అని రాజమౌళి అన్నారు. శ్రీదేవిని సంప్రదించగా ఏడెనిమిది కోట్ల పారితోషికం అడగటమే కాక, షూటింగ్ జరిగినన్ని రోజులు స్టార్ హోటల్ లో సూట్ ఇవ్వాలని కోరడం, అవన్నీ కాక హిందీ భాషలో హక్కుల్లో వాటాలు అడగటం వల్లనే వదిలేశామని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. క్షణక్షణం సౌమ్యుడిలా ఉండేందుకు తాపత్రయపడే రాజమౌళి ఇలా మాట్లాడటం సరికాదనే భావన శ్రీదేవి అభిమానుల్లో వ్యక్తమయింది.

ఇక బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకు సంబంధించి గత కొంత కాలంగా శ్రీదేవికి ప్రశ్నలు ఎదురవుతున్నా నెల రోజుల పాటు శ్రీదేవి కామ్ గానే ఉంది. అయితే పదే పదే ఇదే ప్రశ్న ఎదురవుతుండటంతో తాజాగా స్పందించింది శ్రీదేవి. తన కెరీర్ లో ఇలాంటివి ఎన్నో జరిగాయని కానీ బాహుబలి పై ఎక్కువ వివాదాస్పదమవుతోందని శ్రీదేవి వాపోయారు.

రాజమౌళి గురువు రాఘవేంద్ర రావు తో 24 సినిమాల్లో నటించానని, తాను అలా గొంతెమ్మ కోరికలు కోరేదాన్ని కాదని శ్రీదేవి స్పష్టం చేశారు. అసలు అలాంటి దాన్నయితే ఇన్ని సినిమాలు ఎలా చేసేదాన్నని అన్నారు. రాజమౌళి వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. తాను రకరకాల కారణాల వల్ల చేయని సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అయ్యాయని, అలాగని వాళ్లెవరూ ఇలా మాట్లాడలేదని శ్రీదేవి అన్నారు.

రాజమౌళి తీరు తనను పూర్తిగా అవమానపరిచిందని, తనతో నిర్మాతలు అలా చెప్పి వుంటారని తాను భావిస్తున్నాని శ్రీదేవి అన్నారు. తన భర్త బోనీ కపూర్ కూడా నిర్మాతేనని, నిర్మాతల కష్ట నష్టాలేంటో తమకు తెలుసని శ్రీదేవి అన్నారు. ఇకనైనా ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలని హితతవు పలికారు. చివరగా రాజమౌళి మరిన్ని బాహుబలి లాంటివి లేదా అంతకు మించిన సినిమాలు తీసి ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని శ్రీదేవి అన్నారు.