Asianet News TeluguAsianet News Telugu

వాటన్నిటికి లేని నొప్పి దీనికి అంతలా ఎందుకు?

  • బాహుబలి ఆఫర్ పై స్పందించిన అతిలోక సుందరి శ్రీదేవి
  • బాహుబలి ఆఫర్ వచ్చినప్పుడు మరెన్నో ఇతర సినిమాలు తిరస్కరించానన్న శ్రీదేవి
  • వాటన్నింటిపై లేని వివాదం బాహుబలిపైనే ఎందుకని ప్రశ్నిస్తున్న అందాలతార
sridevi opened about her baahubali offer for shivagami role

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో సినిమాలో చూశాం. భారత దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని కలెక్షన్లు సాధించి బాహుబలి చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికి అరుదైన గౌరవం దక్కింది. అయితే ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రగా చెప్పుకొనే శివగామి పాత్రకు ముందుగా అందాల తార శ్రీదేవిని సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వల్ల శివగామి పాత్రను చేయడానికి శ్రీదేవి నిరాకరించింది.

అయితే ఆ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మామ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా శ్రీదేవి ఆ వివాదంపై స్పందించారు. “నేను బాహుబలి సినిమాను చూడలేదు. ఆ సినిమా గురించి మాట్లాడటం తగదు. ఒకవేళ ఆ సినిమా చూసి ఉంటే నేను స్పందించేదాన్ని. అందులో పాత్రను నిరాకరించడం వల్ల నేను బాధపడటం లేదు. ఆ పాత్రను వదులుకోవడం వల్ల నా ప్రతిష్ఠకు వచ్చిన ముప్పేమీ లేదని శ్రీదేవి అన్నారు.

బాహుబలి పాత్ర కోసం నన్ను సంప్రదించిన విషయం వాస్తవమే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నిరాకరించాను. ఆ కారణాలు ఏమిటనేవి ఇప్పుడు అప్రస్తుతం. దానినో పెద్ద వివాదంగా మలచడం సరికాదు అని శ్రీదేవి పేర్కొన్నారు. అయితే భారీ రెమ్యూనరేషన్ తోపాటు లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినందు వల్లే శివగామి పాత్ర రమ్యకృష్ణకు దక్కిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ..”ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత నేను చాలా సినిమాలు ఒప్పుకోలేదు. అందుకు సంబంధించిన నాకు కొన్ని పట్టింపులు ఉన్నాయి. బాహుబలి తర్వాత నేనేదో నేరం చేసినట్టు ఫీలవుతున్నారు. బాహుబలికి ముందు నేను చాలా సినిమాలు ఒప్పుకోలేదు. వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు. బాహుబలి గురించే వివాదం చేస్తున్నారు” అని ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం శ్రీదేవి మామ్ సినిమా ప్రమోషన్‌పైనే దృష్టిపెట్టింది. ఈ చిత్రం జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం రిలీజ్ డేట్ శ్రీదేవికి చాలా ప్రత్యేకమైనది. శ్రీదేవి సినీరంగంలోకి ప్రవేశించి ఆ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతాయి. అదే రోజున మామ్ చిత్రాన్ని రిలీజ్ చేసి శ్రీదేవి అరుదైన గిఫ్ట్‌ అందించాలని నిర్మాత, భర్త బోనీ కపూర్ ప్లాన్ చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios