- Home
- Entertainment
- Ravana Birthplace: రావణుడు ఇండియాలో పుట్టాడా ? మరి లంకకు రాజు ఎలా అయ్యాడు..సవతి సోదరుడు విషయంలో ఏం జరిగింది
Ravana Birthplace: రావణుడు ఇండియాలో పుట్టాడా ? మరి లంకకు రాజు ఎలా అయ్యాడు..సవతి సోదరుడు విషయంలో ఏం జరిగింది
రామాయణం సినిమా రిలీజ్ కావడంతో రావణుడి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రావణుడు భారతదేశంలో జన్మించి లంకకు రాజుగా ఎలా మారాడు? సవతి సోదరుడు కుబేరుడితో అతడికి జరిగిన పోరాటం వెనుక ఆసక్తికర విషయాలివే.

రావణుడి జన్మస్థానం ఎక్కడ ?
రామాయణంలో రావణాసురుడు అత్యంత శక్తివంతమైన, విరుద్ధమైన పాత్రలలో ఒకటి. రామాయణ ఇతిహాసం ద్వారా రావణుడి గురించి అనేక విషయాలు ప్రజలకు తెలుసు. లంకా నగరానికి రాజు అని, సీతని అపహరించడం, ఆ తర్వాత రాముడి చేతిలో మరణించడం ఈ విషాయాలన్ని రామాయణం ద్వారా తెలుసుకున్నాం. అయితే రావణుడి గురించి అంతగా ప్రచారంలో లేని విషయాలు కూడా ఉన్నాయి. రావణుడు లంకా నగరానికి రాజు అయినప్పటికీ జన్మించింది మాత్రం భారతదేశంలోనే. ఆ వివరాలు తెలుసుకునేందుకు కథనంలోకి వెళదాం. రావణుడు లంకాధిపతిగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఆయన మూలాలు భారతదేశంతోనే ముడిపడి ఉన్నాయి. గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మించి, అపారమైన తపశ్శక్తితో లంకను జయించి రాజుగా మారిన ఆయన జీవన ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.
రావణుడి ఫ్యామిలీ ఇదే
రావణుడి తండ్రి బ్రహ్మదేవుని మనవడైన 'విశ్రవ మహర్షి' (విశ్రవసుడు), తల్లి అసుర కన్య అయిన 'కైకసి'. ఉత్తర భారతదేశంలో విశ్రవ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతంలోనే (నేటి ఉత్తర ప్రదేశ్లోని 'బిస్రఖ్' గ్రామంగా నమ్ముతారు) రావణుడు జన్మించాడు. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. ఆయనతో పాటు కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులు, శూర్పణఖ అనే సోదరి జన్మించారు.
రావణుడు పొందిన వరాలు
తండ్రి నుండి వేదాలు, శాస్త్రాలు, సంగీతం అభ్యసించిన రావణుడు, తల్లి ప్రేరణతో అసుర శక్తిని పెంపొందించుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని మెప్పించి దేవతలు, రాక్షసులు, యక్షుల వల్ల తనకు మరణం లేకుండా అజేయమైన వరాలు పొందాడు. అలాగే పరమశివుడిని తన భక్తితో, సామగానంతో మెప్పించి ఆత్మలింగాన్ని, శక్తివంతమైన 'చంద్రహాసం' అనే ఖడ్గాన్ని బహుమతిగా పొందాడు.
సవతి సోదరుడిని వదల్లేదు
అప్పట్లో సమృద్ధికి, ఐశ్వర్యానికి మారుపేరైన 'లంకా నగరం' రావణుడి అన్న అయిన కుబేరుడి పాలనలో ఉండేది. తండ్రి ఒక్కడే అయినా కుబేరుడు దేవతల పక్షాన, రావణుడు అసురుల పక్షాన నిలిచారు. అమితమైన శక్తులు సంపాదించిన రావణుడు, తన తల్లి కోరిక మేరకు లంకపై దండెత్తి కుబేరుడిని ఓడించి, ఆయన వద్ద ఉన్న 'పుష్పక విమానాన్ని' కూడా వశపరచుకున్నాడు.
యశ్ పాత్రపై చర్చ
ఈ విధంగా కుబేరుడిని లంక నుండి తరిమివేసి రావణాసురుడు లంకా సింహాసనాన్ని అధిరోహించాడు. రావణుడి పరిపాలనలో లంక సువర్ణమయంగా మారి గొప్ప వైభవాన్ని సంతరించుకుంది. భారతదేశంలో జన్మించి, వేదపండితుడిగా ఎదిగి, తన పరాక్రమంతో లంకాధిపతిగా మారిన రావణుడి కథ పురాణాలలో ఒక విశిష్టమైన అధ్యాయం. ఇటీవల నితేశ్ తివారి దర్శకత్వంలో రామాయణం చిత్రం తెరకెక్కింది. పార్ట్ 1 విడుదలయింది. ఈ చిత్రంలో రావణుడిగా యశ్ నటించారు. పురాణాలకు సంబంధించిన చిత్రాలు ఎప్పుడు విడుదలైనా సోషల్ మీడియాలో చర్చ జరగడం సాధారణమే. ఇప్పుడు రావణుడి గురించి నెటిజన్లు పలు ఆసక్తికర విషయాలు చర్చించుకుంటున్నారు.





