నటి శ్రీరెడ్డిపై ఇటీవల చెన్నైలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. సుబ్రమణ్యం అనే ఫైనాన్షియర్ తన ఇంటికి వచ్చి చంపడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీరెడ్డి. ఈ కేసుని చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సీసీ టీవీ ఫుటేజ్ ని విడుదల చేసింది శ్రీరెడ్డి. 

అర్ధరాత్రి సమయంలో సుబ్రమణ్యం కొంతమంది మనుషులను వెంటబెట్టుకొని వచ్చినట్లు ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను షేర్ చేసిన శ్రీరెడ్డి గొడవలకు గల విషయాలను వివరించింది. గతంలో సుబ్రమణ్యం అనే ఫైనాన్షియర్ హైదరాబాద్ లో పెద్ద స్కామ్ చేశాడని, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయిందని, నాలుగు నెలలు జైలులో శిక్ష అనుభవించి పదిహేను రోజుల క్రితం జైలు నుండి విడుదలయ్యారని చెప్పింది. 

తాను తమిళ్ లో చేస్తున్న 'రెడ్డి డైరీస్' సినిమాకు కూడా ఫైనాన్స్ ఇచ్చింది సుబ్రమణ్యమని.. ఆ సినిమాలో నటిస్తున్న కారణంగా పోలీసులు ఆమెని కూడా విచారించినట్లు తెలిపింది.

అయితే పోలీసులకు తానే పట్టించానని కక్ష పెంచుకొని చంపడానికి ప్రయత్నించాడని చెబుతోంది శ్రీరెడ్డి. ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని అంటోంది. కొంతమంది కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారని, తను భయపడే రకం కాదని అంటోంది శ్రీరెడ్డి.