బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా క్రేజ్ దక్కించుకున్న బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకొంది. ఇప్పుడు మూడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ముందుగా షో హోస్ట్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు షో నిర్వాహకులు.

సీజన్ 1కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తే, సీజన్ 2కి నాని హోస్ట్ గా పనిచేశారు. ఇప్పుడు సీజన్ 3ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, రానా ఇలా చాలా మంది హీరోలపేర్లు వినిపించాయి.

వీరిలో అక్కినేని నాగార్జున పేరు ఫైనల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే బుల్లితెరపై 'మీలో కోటీశ్వరుడు' వంటి షోని హోస్ట్ చేసిన అనుభవం ఉండడంతో నాగ్ అయితే బిగ్ బాస్ షోకి న్యాయం చేస్తాడని భావిస్తున్నారు.

అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాదు.. మా వెంకీ మామ అంటోంది నటి శ్రీరెడ్డి. ''వెంకీ మామ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ బాస్ హోస్ట్ గా వెంకీ మామ.. ఎస్ ఎస్ ఎస్.. అందరి ప్రేమ వెంకీ మామకి ఎల్లప్పుడూ ఉంటుంది'' అంతో వెంకటేష్ ఫోటోని షేర్ చేసింది.