టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కలిసి నటించిన మూవీ `ఆదికేశవ`. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని మార్చిందియూనిట్. కొత్త డేట్‌ని ప్రకటించింది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల, వైష్ణవ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం `ఆదికేశవ`. తొలి మూవీ `ఉప్పెన`తో సంచలనం క్రియేట్ చేసిన వైష్ణవ్ తేజ్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రంతో వస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది యూనిట్. మొదట ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అని చాలా రోజుల క్రితం ప్రకటించారు. కానీ తాజాగా రిలీజ్ డేట్‌ని వాయిదా వేశారు.
తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది యూనిట్. దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాతో మాస్ మూవీ ప్రియులను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలని దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించి మెప్పించిందన్నారు.
``ఆదికేశవ`లో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఆమె చిత్ర అనే పాత్రలో సందడి చేయనున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె అందం, పాత్రలోని చిలిపితనం ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే `ఆదికేశవ` చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నామ`ని యూనిట్ తెలిపింది.
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రీలీల, `ఉప్పెన`తోనే టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన మెగ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావడంతో దీనిపై మంచి బజ్ ఏర్పడింది.
