యుఎస్ బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు స్పైడర్ జోరు తొలిరోజే మిలియన్ డాలర్లు వసూలు చేసిన స్పైడర్ ఫస్ట్ వీకెండ్ కల్లా మొత్తం రూ.75 కోట్లు గ్రాస్ దాటుతుందని అంచనాలు
ప్రిన్స్ మహేశ్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక క్రిటిక్స్ రివ్యూలు కాస్త నెగటివ్ గానే వచ్చాయి. అయితే.. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రిలీజ్ అయిన తొలిరోజునే టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల దూకుడు ప్రదర్శిస్తోంది. మన దేశంలో కంటే అమెరికాలో స్పైడర్ చిత్రం ఓ రోజు ముందే రిలీజైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల రిపోర్ట్ ఈ విధంగా ఉంది.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాలో స్పైడర్ చిత్రం తొలి రోజున ఒక మిలియన్ డాలర్ల మార్కు (6.5 కోట్లు)ను సునాయాసంగా దాటింది. ఓవర్సీస్ మార్కెట్లో ఓ భారతీయ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం ఆశ్చర్యం అని కథనంలో పేర్కొన్నది. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్, బాహుబలి2 చిత్రాలు మాత్రమే 2 మిలియన్ల డాలర్లను వసూలు చేశాయి. అమెరికాలో స్పైడర్ దాదాపు 300 స్క్రీన్లలో విడుదల కావడం మహేశ్ బాబు కెరీర్‌లోనే ఓ రికార్డు. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ చిత్రం 6 లక్షల డాలర్లను రాబట్టింది. మహేశ్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర టికెట్ ధరను 25 డాలర్లుగా నిర్ణయించారు. మంగళవారం నాటి వసూళ్ల పరంగా చూస్తే బాహుబలి2 రికార్డులను స్పైడర్ తిరగరాసింది.
ఫస్ట్ వీకెండ్ కల్లా స్పైడర్ చిత్రం దాదాపు 12 మిలియన్ డాలర్లను వసూలు చేసే అవకాశం ఉందని ఫోర్బ్స్ అంచనా. గతంలో మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్ర రికార్డులను స్పైడర్ తిరగరాసే అవకాశం ఉంది అని ఫోర్స్ అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ చిత్రం తొలి రోజున సుమారు 40 కోట్లు (షేర్), 65 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25 కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించవచ్చు అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
