హాలీవుడ్‌కు చెందిన 'స్పైడర్‌ మ్యాన్‌' సిరీస్‌లకు అంతా అభిమానులే. వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఆక‌ట్టుకున్న సూప‌ర్ హీరో 'స్పైడ‌ర్ మ్యాన్‌'. మార్వెల్‌ కామిక్స్‌ నుంచి పుట్టిన ఈ చిత్రానికి ఇటీవల సీక్వెల్ కూడా వచ్చింది. అదే  'స్పైడర్‌ మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోం'. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్ లో తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందా..? అని ఎదుచూస్తోన్న అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్.

ఇకపై మార్వేల్ స్టూడియోస్ లో 'స్పైడర్ మ్యాన్'ని చూడలేమట. మంగళవారం నాడు హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రచురించింది. మార్వేల్ కి సోనీ సంస్థకి మధ్య స్పైడర్ మ్యాన్ సిరీస్ కి సంబంధించిన డీల్ ముగిసిపోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టడం లేదు.

మార్వేల్ కి సోనీ సంస్థకి మధ్య జరిగిన చర్చల్లో ఫైనాన్సియల్ గా కొన్ని ఇష్యూలు రావడంతో ఆ ఎఫెక్ట్ 'స్పైడర్ మ్యాన్' సిరీస్ పై పడింది. మార్వేల్ మూవీస్ లో వచ్చే ఏ సినిమాలో  కూడా  'స్పైడర్‌ మ్యాన్‌' కనిపించరని సమాచారం. 'స్పైడర్ మ్యాన్' గా నటుడు టామ్ హోలాండ్ తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపై మార్వేల్ స్టూడియోస్ లో 'స్పైడర్ మ్యాన్' భాగం కాదనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో 'సేవ్ స్పైడర్ మ్యాన్' అంటూ ట్వీట్లు పెడుతున్నారు. 'ఎవెంజర్స్ ఎండ్ గేమ్' టోనీ స్టార్క్ చనిపోయి తన పవర్స్ అన్నింటినీ స్పైడర్ మ్యాన్ కి ఇస్తాడు. ఇప్పుడు టోనీ స్టార్క్ చావుకి అర్ధం లేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.