టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా గాయకుడిగా దాదాపు 2500 పాటలు ఆలపించాడు.

సింగర్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు తీశాడు. ఈ క్రమంలో అతడు ఎంతో నష్టపోయాడట. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన సినిమాల్లో డబ్బులు పెట్టి నష్టపోయానని చెప్పాడు. 'వర్షం' సినిమా తమిళంలో రీమేక్ చేసిన సమయంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామని ఆ సినిమాతో డబ్బులు బాగానే పోయాయని అన్నారు.

మొదటి సినిమా డబ్బు తన తండ్రిదేనని.. రెండో సినిమాకు బిజినెస్ అయిందని.. కానీ పెట్టుబడి పెట్టిన వాళ్లకు డబ్బులు రాకపోవడంతో ఆ మొత్తాన్ని చెల్లించడానికి మళ్లీ నాన్నగారి దగ్గర నుండి తీసుకున్నానని చెప్పారు. మూడో సినిమాకి డబ్బులు రావడంతో వరుసపెట్టి మరో మూడు సినిమాలపై పెట్టుబడి పెట్టానని.. అన్నీ తమిళంలోనే చేసినట్లు కానీ ఒక్కొక్కటీ ఫ్లాప్ అవుతూ రావడంతో నష్టం ఎక్కువైపోయిందని అన్నారు.

నిర్మాతగా పేరు మిగిలిందే తప్ప డబ్బులు రాలేదని అన్నారు. నాన్నగారి డబ్బు పోగొట్టానని ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ తనను ఒక్క మాట కూడా అనలేదని.. 'మంచి సినిమా తీశావ్.. అది జనానికి చేరలేదు' అనేవారని.. ఆయనకి సారీ చెప్పాలని అన్నారు. తన తండ్రే తనకు గొప్ప బలమని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టానని.. అన్నింటికీ ఒక సారీ చెప్తే సరిపోదని అన్నారు.