లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల కరోనా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే హాస్పిటల్‌లో చేరే సమయానికి ఆయన ఆరోగ్యంగానే కనిపించినా కొద్ది రోజులకు ఆయన పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావటంతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కూడా రావటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది.

విషమపరిస్థితుల్లోనే కొద్ది రోజులు ఉన్న ఎస్పీబీ తరువాత క్రమంగా కోలుకుంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ కూడా వచ్చినట్టుగా ఆయన తనయుడు చరణ్ వెల్లడించారు. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ఇంకా తగ్గకపోవటంతో ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపం రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎస్పీ బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, ఆయన ఊపిరితిత్తుల మార్పిడికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న పుకార్లు రావటంతో వాటిపై చరణ్ స్పందించారు. `నాన్న గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయటంతో రోజంతా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దయచేసి అలాంటి ప్రచారాలు ఆపేయండి. నాన్న ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషమైనా నేను స్వయంగా వెల్లడిస్తాను. లేదా ఆసుపత్రి వర్గాలు అధికారికంగా నోట్ రిలీజ్  చేస్తాయి` అంటూ తెలిపారు.

ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న చరణ్, ప్రతీ రోజు అప్‌డేట్‌ ఇచ్చేంత మార్పులు ఏమీ లేకపోవటంతోనే అప్‌డేట్‌ ఇవ్వటం లేదని చెప్పారు. దయచేసి మీడియా కూడా సంయమనం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు చరణ్‌.