కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గత కొద్ది రోజులుగా తీవ్రమైన పరిస్దితిని ఎదుర్కొన్న ఆయన కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. గురువారం ఎస్పీ బాలుకి వైద్యులు ఫిజియోథెరపీ చికిత్స కూడా చేసినట్లు పేర్కొన్నారు. కొద్ది రోజులు పాటు  ఫిజియోథెరపీ చికిత్స కంటిన్యూ అవుతుంది.

‘‘ఆస్పత్రి వర్గాలు చెప్పిన దాని ప్రకారం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీ చికిత్స కూడా అందించారు. అయితే, నాన్నను నేను చూడలేదు. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. నాన్న ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు, వైద్యుల కృషి అనిర్వచనీయం. వారికి కృతజ్ఞతలు. అదే సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని అప్‌డేట్‌లు ఇస్తా’’ అని ఎస్పీ చరణ్‌ అన్నారు.   

ఈ నెల మొదటివారంలో కరోనా బారిన పడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.