సంగీత దర్శకుడు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో ఎన్నో అపురూప గీతాలు వచ్చాయి. అయితే ఆ మధ్య వీరి అనుబంధానికి బ్రేక్ పడింది. ఎస్పీబీ స్టేజ్ షోలలో ఇళయరాజా కంపోజ్ చేస్తోన్న పాటలు పాడుతుండడంతో ఇళయరాజా ఫైర్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన పాటలు పాడడానికి వీలులేదంటూ ఎస్పీబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ గొడవ కోర్టు వరకు వెళ్లింది. దీంతో ఎస్పీబీ.. బయట ఈవెంట్స్ లో ఇళయరాజా పాటలు పాడడం మానేశారు. అయితే ఇప్పుడు ఆ వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ మునుపటిలా మంచి స్నేహితులు అయిపోయారు. దీని గురించి ఎస్పీబీ మరోసారి గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ఎస్పీబీ.. ఇళయరాజాతో గొడవపై స్పందించారు.

తమ మధ్య ఎప్పుడూ ఏ గొడవలూ లేవని.. ఓ టెక్నికల్ సమస్య వలన ఇద్దరి అనుబంధానికి చిన్న బ్రేక్ వచ్చిందని.. ఇప్పుడు అదంతా సమసిపోయిందని చెప్పారు. సోషల్ మీడియాలో జనాలకు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకుండా పోతుందని.. ఇతర వ్యక్తులు ఈ ఇష్యూ గురించి ఎక్కువగా మాట్లాడడంతో సమస్య పెద్దగా కనిపించిందని చెప్పుకొచ్చారు.

ఇళయరాజాతో కలిసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని.. తన పిలుపు కోసం ఎదురుచూశానని, ఇప్పుడు ఇద్దరం కలిసి పని చేయడం మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. తను ఆలపించిన గీతాల్లో సగానికి పైగా ఇళయరాజా స్వరపరిచిన పాటలేనని.. అవి పాడకుండా ఎలా ఉండగలనని అన్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని తేల్చిచెప్పారు.