ఇతర రాష్ట్రాల కంటే ఏపీ, తెలంగాణల్లో అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్న సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వీస్‌ ప్రొవైడర్లను కట్టడి చేయాలనే ఉద్దేశంలో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసేయాలని నిర్ణయించింది. వారం గడువు లోగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తమతో చర్చలకు ముందుకు రాకపోతే 'థియేటర్స్ బంద్' అని తేల్చి చెప్పింది..

డిజిటల్‌ ప్రొవైడర్ల బాదుడుపై చర్చించేందుకు దక్షిణాది ఫిల్మ్‌ చాంబర్‌ మెంబర్స్‌ అందరూ నేడు సమావేశమయ్యారు. ప్రస్తుతం డిజిటల్‌ ప్రొజక్షన్‌ నిమిత్తం డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు రూ.20వేల వరకు వసూలు చేస్తుండగా.. ఇది చాలా అధిక మొత్తమని, దీనివల్ల నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు భారీ నష్టం ఏర్పడుతోందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

'సినిమాకు పని చేసినవాళ్లకు ప్రతిఫలం దక్కకుండా మధ్యవర్తులు దోచుకోవటం చాలా అన్యాయం. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు వ్యవహరం ఈస్ట్‌ ఇండియా కంపెనీలాగా తయారైంది.' అని ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షులు పి.కిరణ్ వాపోయారు.

'ఒకవేళ ఎవరైనా తక్కువ ధరకు ప్రొవైడ్‌ చేయడానికి ముందుకొచ్చినా.. వారిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఒక వారంలోగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు చర్చలకు రాకపోతే మార్చి 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసేయాలని నిర్ణయించాం' అని తెలిపారు.

ఎక్కడనుంచో వచ్చిన ప్రొవైడర్లు అన్యాయంగా చిత్రపరిశ్రమను దోచుకు తింటున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. డిజిటల్‌ ప్రొవైడర్లతో ఒకవారంలోగా సమావేశం ఏర్పాటుచేసి వెంటనే ధరలు తగ్గుదలకు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.

ఒకవేళ చర్చలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ముందుకు రాకపోయినా.. లేదా సమస్యకు పరిష్కారం లభించకపోయినా మార్చి 1వ తేదీ నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్స్ బంద్ చేయడానికే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

సమావేశంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్ష కార్యదర్శులు పి.కిరణ్‌, ఎం.రాందాస్‌, కె.శివప్రసాదరావు, నిర్మాతలు డి.సురేష్‌బాబు, శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి, తమిళ సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌ కృష్ణ, కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ సెక్టరీ ఎన్‌.ఎమ్‌. సురేష్‌, కేరళ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.