మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటెర్టైనర్ ఆచార్య. కోవిడ్ బ్రేక్ తరువాత తిరిగి మొదలైన ఆచార్య షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. కీలక రోల్స్ చేస్తున్న సోనూ సూద్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కాగా ఆచార్య సెట్స్ నుండి సోనూ సూద్ లుక్ బయటికి వచ్చింది. నలుపు చొక్కా ధరించిన సోనూ సూద్ కోరమీసం, మెడలో రుద్రాక్ష మాల మరియు బొట్టుతో కనిపించారు. 

ఆధ్యాత్మికంగా మరియు ఫెరోషియస్ గా లుక్ ఉండగా ఆచార్య సినిమాలో సోనూ సూద్ పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఆచార్య దేవాలయాలు, సంస్కృతి చుట్టూ తిరిగే సోషల్ కాన్సెప్ట్ మూవీ అని ప్రచారం జరుగుతుండగా... సోనూ సూద్ లుక్ మరింత బలపరిచేదిగా ఉంది. సోనూ సూద్ తన ఆత్మకథ ''ఐ యామ్ నాట్ మెస్సయ్య'' పుస్తకాన్ని ఆచార్య సెట్స్ లో చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి, సోనూ సూద్ ఫోటోలకు పోజులివ్వగా సోనూ సూద్ లుక్ రివీల్ అయ్యింది. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ మూవీలో కూడా సోనూ సూద్ కీలక రోల్ చేస్తున్నారు. ఆ సినిమా కోసం తెరకెక్కించిన ఓ మాస్ ఐటెం సాంగ్ లో సాయి శ్రీనివాస్ తో కలిసి సోనూ సూద్ స్టెప్స్ వేశారు.  దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ఐటెం సాంగ్ లో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ స్టెప్స్ వేయడం విశేషం. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న అల్లుడు అదుర్స్ విడుదల కానుంది.