కరోనా నేపథ్యంలో నిస్సహాయుల పాలిట ఆపద్బాంధవుడిగా మారారు స్టార్‌ సోనూసూద్‌. వలస కార్మికుల్ని స్వగ్రామాలకు తరలించడం నుంచి పేదల వైద్యం, విద్య వరకూ ఎన్నో రూపాల్లో తనవంతు సాయం అందిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఓ గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు పేదల హృదయాల్లో రియల్‌ హీరోగా చెరగని ముద్ర వేశారు. సోనూ ఎక్కడ కనిపించినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఆయన దాతృత్వానికి అడ్డూ అదుపు లేదు. ఆయన చేతికి వెన్నుముక లేదన్నట్లు గా ఆయన దానాలు చేస్తున్నారు. తాజాగా ఆచార్య సెట్లోనూ ఆయన తన దాన గుణం చూపించారు.

సోనూసూద్ ‘ఆచార్య’ క్రూ మెంబర్స్ కు వంద స్మార్ట్ ఫోన్స్ గిప్ట్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. బుధవారం ఆయన పర్శనల్ గా ఈ ఫోన్ లను అందించారు. తమ చిత్ర యూనిట్ లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కునే పరిస్దితి లేదని, దాంతో వాళ్ల పిల్లలు ఆన్ లైన్ క్లాస్ లకు హాజరు కాలేకపోతున్నారని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ విషయం అర్దం చేసుకున్న సోనూ వెంటనే ఓ వంద స్మార్ట్ ఫోన్ లకు ఆర్డర్ చేసి, ప్రెజంట్ చేసారు. ఈ విషయం తమకు స్మార్ట్ ఫోన్ లు చేతికి వచ్చేవరకూ యూనిట్ లో ఎవరికీ తెలియదు. అందరూ ఆశ్చర్యపోతూ ఆయన దానగుణం మెచ్చుకుంటున్నారు.

ఇక  ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆచార్య’ చిత్రం ప్రస్తుతం కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్‌ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్‌.  అయితే, కొరటాల శివ టేకింగ్‌, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌ కథనాయిక. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే ‘ఆచార్య’ ఇంకా సెట్స్‌పై ఉండగానే నిర్మాతలు నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింద పెద్ద మొత్తంలో అందుకోబోతున్నారని టాక్. అది ఆడియో హక్కుల ద్వారా అని వినపడుతోంది. ‘అల.. వైకుంఠపురములో..’తో కిందటేడాది భారీ విజయాన్ని అందుకోవడంతో కోట్లు గడించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇప్పుడు ‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను చేజిక్కించుకుంది అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా రూ.నాలుగు కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ‘ఆచార్య’ హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుందట.