రైతులను చూస్తుంటే బాధేస్తుందని, రోడ్డుపై వారిని అలా చూసిన దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోలేనని రియల్ హీరో సోనూ సూద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు గత కొన్ని రోజులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు. 

హృదయ విదారకమైన రైతుల స్థితి చూసి అంత చలించిపోతున్నారు. ఇది తనకు కూడా బాధ కలిగించాయని అంటున్నారు సోనూసూద్‌. ఆయన `వి ది వుమెన్‌` పేరుతో నిర్వహించిన వర్చువల్‌ మీట్‌లో జర్నలిస్ట్ బర్ఖతో ముచ్చటించారు. రైతుల దుస్థితి చూసి ఆవేదనకు గురవుతున్నట్టు తెలిపారు. 

ఇందులో ఎవరిది తప్పు? ఎవరికి ఒప్పు? అని నేను వాదించడం లేదని, రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు చెప్పారు. తాను కూడా పంజాబ్‌లోనే పుట్టి పెరిగినట్టు, రైతులతో చాలా అనుబంధం ఉందని పేర్కొన్నారు. ప్రేమతో చెబితే వారు వింటారని, ఈ పోరాటంలో రైతులు కొంత మంది ప్రాణాలు కోల్పోయారు, పంట పొలాల్లో విత్తనాలు నాటాల్సిన సమయంలో రోడ్లపై, తమ పిల్లలతో వణుకుతూ గడుపుతున్నారు. ఈ దృశ్యాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకా ఎన్ని రోజులు మనం వారిని ఈ స్థితిలో చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. 

సోనూసూద్‌ లాక్‌డౌన్‌ టైమ్‌లో వలస కార్మికులను ఆదుకుని రియల్‌ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. అనంతరం కూడా సహాయం కోరిన వారికి తనవంతు హెల్ప్ చేస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు.