హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. ప్రస్తుతం ఈ మూవీ థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. అయితే ఈ చిత్రానికి అన్ని చిక్కులే వచ్చి పడుతున్నాయి. ఈ సందర్భంగా తమ మూవీని కొందరు అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని రాజశేఖర్ తాజాగా స్పందించారు.  

హీరో రాజశేఖర్‌ (Rajasekhar) నటించిన `శేఖర్‌` (Shekar) చిత్రాన్ని, జీవితా రాజశేఖర్‌లను పలు వివాదాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. గత సినిమా `గరుడవేగ` విషయంలో ఆ చిత్ర నిర్మాతలు తమకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. దీంతో ఆ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే ఇటీవల మరో ఫైనాన్షియర్‌ తమకు రూ. 65లక్షలు ఇవ్వాల్సి ఉందంటూ కోర్ట్ కి ఎక్కారు. 48 గంట‌ల్లోపు రూ.65 ల‌క్ష‌లు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత స‌మ‌ర్పించ‌ని ప‌క్షంలో శేఖర్‌ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను ఎటాచ్ చేస్తూ.. ఆ సినిమాను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా ఫైనాన్షియర్ ప‌రంధామ‌రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. 

ఇప్పటికే `శేఖర్‌` సినిమా నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నా సినిమాకు, జీవిత, రాజశేఖర్ కు నష్టం కలిగిస్తే, ఏదైనా జరిగితే, పరువు నష్టం దావా కేసు వేస్తానంటూ గట్టిగా హెచ్చిరించారు. ఈ క్రమంలో రాజశేఖర్ కూడా స్పందిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘నాకూ, నా కుటుంబానికీ ఈ సినిమా సర్వస్వం. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ‘శేఖర్‌’కి అంతటా అద్భుతమైన స్పందన వస్తోంది. కానీ నేడు అసహనంతోనే కొందరు కుట్ర పన్ని.. మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమా మా ప్రాణం. ఈ సినిమా మాది. నేను చెప్పాల్సిన విషయాలు అయిపోయాయి. ఈ చిత్రానికి నిజంగా అర్హమైన దృశ్యమానత మరియు ప్రశంసలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను.’ అంటూ తన వెర్షన్ వివరించారు. 

ఇక రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రూ. 3.25 కోట్లు మాత్రమే బిజినెస్ చేయగలిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా ఆదరణ లేకపోవడంతో కలెక్షన్స్ లేవనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా వివాదంలో పడటం పెద్ద మైనస్. అయితే ఈ సమస్య ఎలా సద్దుమణుగుతుందో చూడాలి. జీవిత రాజశేఖర్ (Jeevitha) డైరెక్షన్ లో, డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్’ (Shekar). వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ సినిమా తెలుగు రీమేక్ గా ‘శేఖర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.