కరోనా కారణంగా సినిమాల విడుదల ఆగిపోయాయి. థియేటర్లు సైతం మూత పడటంతో ఇన్నాళ్ళు వెయిట్‌ చేశారు. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్‌కి అనుమతినిచ్చింది. గత వారమే థియేటర్లు ఓపెన్‌ కావాల్సి ఉంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌ ధైర్యం చేశాడు. తన సినిమాని ఓటీటీలో కాకుండా థియేటర్‌లోనే విడుదలకు సిద్దమయ్యాడు. 

ప్రస్తుతం సాయితేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. డైరెక్ట్ గా ఇక థియేటర్‌లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. 

డిసెంబర్‌ 25న క్రిస్‌మస్‌ కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, హీరో సాయితేజ్‌ అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌లో సందడి చూసేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు సాయితేజ్‌ తెలిపారు. ఈ లెక్కన థియేటర్‌లో వచ్చే మొదటి పెద్ద సినిమా ఇదే కానుందని చెప్పొచ్చు.