మొన్న `లక్కీ లక్ష్మణ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన కామెంట్లని రచ్చ చేస్తున్నారని ఆవేదన చెందారు హీరో సోహైల్. తన వీడియోలపై సోషల్ మీడియాలో కామెంట్లు చూసినప్పుడు చాలా బాధేసిందన్నారు.
సినిమాల్లో నటించడం ఈజీనే కానీ స్టేజ్‌పై, మీడియా ముందు నటించలేకపోతున్నా అని అంటున్నారు బిగ్ బాస్ ఫేస్ సోహైల్. ఆయన హీరోగా పరిచయం కాబోతున్నారు. రేపు(శుక్రవారం) ఆయన హీరోగా నటించిన `లక్కీ లక్ష్మణ్` చిత్రం విడుదల కాబోతుంది. ఏ ఆర్ అభి దర్శకత్వంలో దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. సినిమా డిసెంబర్30న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించారు సోహైల్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన కామెంట్లని రచ్చ చేస్తున్నారని ఆవేదన చెందారు. తన వీడియోలపై సోషల్ మీడియాలో కామెంట్లు చూసినప్పుడు చాలా బాధేసిందని, తననే కాదు, హీరోలపై ఇలాంటి కామెంట్లు వస్తున్నాయని, ఎదిగే వారికి ఈ కామెంట్లు చూస్తే బాధగా ఉంటుందని,ఆ ఆవేదనలో స్టేజ్‌పై తాను అలా మాట్లాడానని తెలిపారు. బయట మామూలుగా ఎలా మాట్లాడతానో, స్టేజ్‌పై కూడా అలానే మాట్లాడానని, మీడియా ముందు, స్టేజ్‌పై తనకు నటించడం రావడం లేదని, అదే ప్రాబ్లమ్ అవుతుందన్నారు. తాను చేసిన కామెంట్లని రచ్చ చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారని చెప్పారు. ఇకపై బయట కూడా నటించాలేమో అని వెల్లడించారు.
ప్రస్తుతం జనాలు పాజిటివ్ కంటె నెగటివ్‌నే చూసేందుకు ఇష్టపడుతున్నారని, మా ఫాదర్ పడ్డ కష్టంపై వీడియో పెడితే ఐదు వందల వ్యూసే వచ్చాయని, అదే స్టేజ్‌పై తాను చేసిన కామెంట్ల వీడియోలకు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయని, చిరంజీవి సర్ వాల్తేర్ వీరయ్య ప్రెస్‌మీట్ వీడియోలకంటే మా నెగటివ్ వీడియోకే ఎక్కువగా వ్యూస్ వచ్చాయని తెలిపారు సోహైల్.
ఇక `లక్కీ లక్ష్మణ్` గురించి చెబుతూ, క్యూట్ లవ్ స్టోరీ అని, వల్గారిటీ లేని క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, తాను సాఫ్ట్ వేర్‌గా కనిపిస్తానని తెలిపారు సోహైల్. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందన్నారు. కథ, కామెడీ, సంగీతం, కెమెరా వర్క్ ఇవన్నీ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని తెలిపారు. ఈ సినిమాపై తాను చాలా నమ్మకంగా ఉన్నామని, దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారని, సినిమాపై నమ్మకంతో నిర్మాత సొంతంగా రిలీజ్‌కి వెళ్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తన తొలి చిత్రం గురించి చెబుతూ, ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తన లైఫ్‌లో మర్చిపోలేని రోజు అని, దాంతో తనకు విపరీతమైన క్రేజ్ వచ్చిందన్నారు. ఆ క్రేజ్‌తో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని తెలిపారు. మొదట సోహైల్ `మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. కానీ అది ఆర్థిక కారణాలతోపాటు ఇతర కారణాలతో రిలీజ్ ఆలస్యమవుతుందన్నారు. ఆ సినిమా కోసం తాను ఏడాదిపాటు బ్లడ్, స్వెట్ పెట్టానని, రిలీజ్ కాకపోవడంతో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లానని తెలిపారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదన్నారు. ఎప్పుడు రిలీజ్ అయినా తనకు మంచి పేరు వస్తుందని చెప్పారు సోహైల్.
తాను చేయబోతున్న సినిమాల గురించి చెబుతూ, `లక్కీ లక్ష్మణ్`తోపాటు `బూట్‌కట్ బాలరాజు`, `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు`, `మిస్టర్ ప్రెగ్నెంట్` సినిమాలున్నాయని తెలిపారు. ఈ సినిమాలు పూర్తి చేశాక కొత్త ప్రాజెక్ట్ ల గురించి ఆలోచిస్తానని, అంతవరకు కొన్ని స్క్రిప్ట్ లను హోల్డ్ లో పెట్టానని తెలిపారు. సింగరేణి నేపథ్యంలో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయాలనేది తన లక్ష్యమన్నారు సోహైల్.
