సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు అభిమానులు వారితో ఫోటోలు దిగాలని, వారికి దగ్గరగా వెళ్లాలని ఆశ పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు తారలకు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.

కొందరు నటులు మాత్రం తమ వద్దకు వచ్చే అభిమానులతో దురుసుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ మదురైలోని షోరూం ప్రారంభించడానికి అతిథిగా వెళ్లారు. మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్ కూడా ఈ వేడుకకి విచ్చేశారు.

ఈ సందర్భంగా శివకుమార్ తో కలిసి ఫోటోలు దిగాలని కొందరు అభిమానులు ఆయనకి దగ్గరగా వచ్చారు. అయితే ఓ అభిమాని మాత్రం దూరంగా నిలబడి రిబ్బన్ కత్తిరించడానికి వస్తోన్న శివకుమార్ తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. దీంతో శివకుమార్ అభిమాని చేతిలో ఉన్న ఫోన్ ని గట్టిగా పక్కకి నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.

శివకుమార్ ప్రవర్తనతో సదరు అభిమాని షాక్ తిన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో శివకుమార్ కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. అభిమానిని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నారు.