బిగ్ బాస్ సీజన్ వన్ విజేత శివబాలాజీ రన్నరప్ గా నిలిచిన ఆదర్శ్ ఫినాలేలో తొలి ఎలిమినేషన్ అర్చన అనంతరం నవదీప్, ఆ తర్వాత హరితేజ
బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్ ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. గత వారం రోజులుగా ప్రేక్షకుల నుంచి హోరాహోరీ ఓటింగ్ సాగింది. అక్షరాల పదకొండు కోట్ల పైచిలుకు మంది ఓట్లేసి.. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో.. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్‌తో పాటు 50 లక్షల ఫ్రైజ్ మనీ గెల్చుకున్నారు. ఫైనల్‌కి చేరిన ఐదుగురు కన్టెస్టెంట్స్‌లో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఈ పోరులో శివబాలాజీ ... ఆదర్శ్ కంటే ఎనిమిదిన్నర లక్షల ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఓట్లు సాధించి ‘బిగ్ బాస్ సీజన్ 1’ టైటిల్ విన్నర్‌గా నిలిచారు.
ఎందరో మహానుభావులు అందరికీ మీ ఎన్టీఆర్ పాదాభివందనాలు అంటూ బుల్లితెరపై ఎన్టీఆర్ ‘బిగ్ బాస్ షో’తో సందడి మొదలు పెట్టి 71 ఎపిసోడ్‌లను పూర్తిచేశారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో విన్నర్‌ని అనౌన్స్ చేయడంతో బిగ్‌బాస్ సీజన్ 1కి శుభం కార్డు పడింది. 71రోజులు.. 60 కెమెరాల మధ్య.. 16 మంది (ఇద్దరు వైల్డ్ కార్డ్) కన్టెస్టెంట్స్‌తో జూలై 16 వతేదీన బిగ్ బాస్ షో ప్రారంభమైంది.
ఎన్టీఆర్ హోస్ట్ చేయటంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఈ తరహా షో రావడం ఇదే తొలిసారి కావడంతో బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఓవైపు... ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను నడిపించగలరా? అన్న అనుమానాలు మరోవైపు. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌బాస్ చరిత్ర సృష్టించింది. తొలి మూడు వారాల్లోనే రికార్డ్ టీఆర్పీ రేటింగ్‌ను సాధించి తన సత్తా చాటిన బిగ్ బాస్ షో... 70 ఎపిసోడ్‌లను అప్పుడే కంప్లీట్ చేసుకుంది. 14 మంది కన్టెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ షోలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావటంతో కంటెండర్స్ సంఖ్య 16కు చేరింది. ఇక చివరి వారంలోకి చేరుకునే నాటికి ఐదుగురు మాత్రమే మిగిలారు.
బిగ్ బాస్ షోలో అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తీక, శివ బాలాజీ, ఆదర్శ్, హరి తేజ, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్) లు కంటెస్టంట్స్ గా హౌజ్ లో ఎంటరవగా ఫైనల్ కన్టెస్టెంట్స్ గా ఆదర్శ్, శివబాలాజీ, హరితేజ, నవదీప్, అర్చనలు మిగిలారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షోగా దాదాపు 4 గంటల పాటు బిగ్‌బాస్ షో ఆకట్టుకున్నారు. మరోవైపు కీలకమైన ఫైనల్ పోరులో ఉన్న ఐదుగురు కన్టెస్టెంట్స్‌లో అర్చనకు అతి తక్కువ ఓట్లో పోల్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌నుండి తొలుత నిష్క్రమించింది. తాను హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత శివబాలాజీ, నవదీప్‌లలో ఎవరో ఒకరు విన్నర్ కావొచ్చని తెలిపింది.
ఇక మిగిలిన నలుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో తక్కువ ఓట్లు సాధించి నాలుగోస్థానంతో సరిపెట్టుకుని హౌస్ నుండి బయటకు వచ్చేశాడు నవదీప్. ఇక బిగ్ బాస్ హౌస్‌ను వీడి స్టేజ్ మీదకు వచ్చిన నవదీప్.. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అయ్యే అవకాశం హరితేజకు ఎక్కువ ఉందన్నారు.
ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు.
అయితే ప్రేక్షకులు ఈ ముగ్గురిలో తక్కువ ఓటింగ్ హరితేజకు ఇవ్వడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది హరితేజ. ఇక మిగిలిన శివబాలాజీ, ఆదర్శ్‌లలో శివబాలాజీ టైటిల్ విన్నర్ కావొచ్చునని తన అభిప్రాయాన్ని తెలిపింది.
ఇక ఎలిమినేట్ అయిన కన్టెస్టెంట్స్ కోసం ప్రత్యేక అవార్డ్‌లను ప్రకటించారు ఎన్టీఆర్
ఫన్నీ అవార్డ్స్:
ఉచిత సలహా (మహేష్ కత్తి)
అయోమయం(సంపూర్ణేష్ బాబు)
గ్రైండర్ అవార్డ్ (దీక్ష)
రోమియో (ప్రిన్స్)
బెస్ట్ ఎంటర్టైనర్ (ధనరాజ్)
గురకరాయుడు (సమీర్)
ఫిటింగ్ మాస్టర్ (కత్తి కార్తీక)
గుండెల్లో గోదారి(మధుప్రియ)
ఈ ఫైనల్ పోరులో గెలిచిన విన్నర్‌కి బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్‌తో పాటు అక్షరాలా 50 లక్షల కాష్ అందజేశారు బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్.
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ హైలైట్స్:
- బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ ఎపిసోడ్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ పెర్ఫామెన్స్‌ని ఇస్తూ ఎన్టీఆర్ సాంగ్స్‌తో స్టేజ్‌ని షేక్ చేసేశారు. పరస్పరం తలైవా అని సంబోధించుకుంటూ షో పైనల్ ఎపిసోడ్ ని గ్లామరస్ గా మార్చేశారు.
- ఇక ఫైనల్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులను ఫాలో.. ఫాలో.. అనే సాంగ్‌కి దేవిశ్రీతో కలిపి స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు ఎన్టీఆర్.
- దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి స్టేజ్‌ని పంచుకుని ‘జై లవకుశ’ రిలీజై హిట్ అయిన తరువాత దేవిశ్రీని బిగ్‌బాస్ స్టేజ్ మీదే కలుస్తున్నానని చాలా హ్యాపీగా ఉందన్నారు.
- జై లవకుశ సినిమాకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన కారణమని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్.
- ఇక బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ విశేషాలను తెలియజేస్తూ.. ఫైనల్ కన్టెస్టెంట్స్ ఐదుగురురిలో విన్నర్ కోసం జరిగిన ఓటింగ్‌లో 11 కోట్ల తొంభై లక్షల ఓట్లు పోలైనట్లు తెలిపారు ఎన్టీఆర్.
- ఇక బిగ్‌బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ అయిన కన్టెస్టెంట్స్‌లో ముమైత్, కల్పనలు తప్ప మిగతా పోటీదారులందరూ పాల్గొని సందడి చేశారు.
- వారిలో సంపూర్ణేష్ బాబు తాను బిగ్ బాస్ సీజన్ 1 నుండి ప్రారంభంలోనే బయటకు రావడం తప్పేనని ఇప్పుడు చాలా బాధపడుతున్నానంటూ అవకాశం ఉంటే సీజన్ 2లో కన్టెస్టెంట్‌గా పాల్గొంటానని తన మనసులో కోరికను బయటపెట్టాడు.
- అయితే ఒక సీజన్‌లో పాల్గొన్న వారికి మరో ఎపిసోడ్‌లో అవకాశం ఉండదని అయినా నీకోసం స్టార్ మా యాజమాన్యంతో మాట్లాడుతా అంటూ ఎన్టీఆర్ అభయం ఇచ్చారు.
- ఎలిమినేట్ కన్టెస్టెంట్ మధుప్రయ తన పాటలతో స్టేజ్‌ని హుషారెత్తించింది.
- ధనరాజ్ నాయకత్వంలో జ్యోతి, సంపూర్ణేష్ బాబు, సమీర్, కత్తికార్తీక, మహేష్ కత్తి కలిసి ‘బిగ్‌బాస్’ స్కిట్ చేసి నవ్వుల పూవులు పూయించారు.
