విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `లియో` మూవీ థియేట్రికల్ బిజినెస్‌ షాకిస్తుంది. తెలుగులో ఇది భారీ రేట్ కి అమ్ముడు పోవడం ఆశ్చర్యపరుస్తుంది.   

దళపతి విజయ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం `లియో`. `ఖైదీ`, `విక్రమ్‌` వంటి చిత్రాలతో సంచలనాలు క్రియేట్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ రూపొందిస్తున్న చిత్రమిది. విజయ్‌ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగా వస్తోన్న చిత్రమిది. దసరాకి ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో `లియో` బిజినెస్‌ షాకిస్తుంది. తెలుగులో భారీ రేట్ కి అమ్ముడు పోవడం ఆశ్చర్యపరుస్తుంది. 

`లియో` తెలుగు స్టేట్స్ థియేట్రికల్‌ రైట్స్ ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ మొత్తాన్ని వెచ్చించి తెలుగు స్టేట్స్ థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సుమారు రూ. 19కోట్లకి నాగవంశీ ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్నారని సమాచారం. అంతేకాదు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెడుతుంది. ఇన్నాళ్లు సినిమా ప్రొడక్షన్‌ మాత్రమే చేసిన ఈ సంస్థ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. 

కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలతోపాటు భారీ కమర్షియల్‌ చిత్రాలను నిర్మిస్తుంది సితార ఎంటర్టైన్‌మెంట్స్. `భీమ్లా నాయక్‌` ఇందులో రూపొందిన విషయం తెలిసిందే. ఆ మధ్య `సార్‌`(వాతి) చిత్రాన్ని నిర్మించి హిట్‌ కొట్టారు. చిన్నగా ప్రారంభమై పెద్దగా విస్తరిస్తుందీ బ్యానర్‌. ఈ క్రమంలో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్‌లోకి కూడా అడుగుపెట్టడం విశేషం. ఇటీవల కాలంలో ఓ తమిళ చిత్రాన్ని ఇంతటి భారీ మొత్తానికి తెలుగు రైట్స్ దక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైమ్‌ అని అంటున్నారు ట్రేడ్‌ వర్గాలు. సినిమాపై ఉన్న అంచనాలే అందుకు కారణమంటున్నారు. 

ఇక `లియో` సినిమా విషయానికి వస్తే, విజయ్‌, త్రిష జంటగా నటిస్తుండగా, యాక్షన్‌ కింగ్ అర్జున్‌, సంజయ్ దత్ తోపాటు గౌతమ్‌ మీనన్, మిష్కిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, జాఫర్ సాదిక్, మడోన్నా సెబాస్టియన్, అనురాగ్ కశ్యప్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ఇటీవలే చిత్ర బృందం షూటింగ్‌ను పూర్తి చేసింది. దాదాపు 125 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో ప్రధానంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్ మాస్టర్స్‌ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది.

అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో 'మాస్టర్' లాంటి సంచలన ఆడియో వచ్చింది. అదే స్థాయిలో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'లియో' నుంచి విడుదలైన 'నా రెడీ' అనే మొదటి పాటకు విశేష స్పందన లభించింది. ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న 'లియో' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 అక్టోబర్ 19న విడుదలవుతోంది. 'మాస్టర్‌' చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఎస్. లలిత్ కుమార్ 'లియో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్టర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

`లియో` సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.