ఇప్పటి వరకు సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, పాటల కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించిన సింగర్‌ సునీత ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటకు తీస్తుంది. నటిగా మారబోతుందట.

సింగర్‌ సునీత.. అద్భుతమైన సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. అమృతం లాంటి గాత్రంతో ఆమె పాట పాడినా, ఆమె మాట మాట్లాడినా వినసొంపుగా ఉంటుంది. పాటల షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. త్వరలో ఆమె మరో కొత్త వృత్తిలోకి రంగ ప్రవేశం చేయబోతుందట. నటిగా తెరంగేట్రం చేయబోతుందని సమాచారం. స్టార్‌ హీరో సినిమాతో ఆమె నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. 

ఏకంగా మహేష్‌బాబు సినిమాలో నటించబోతుందని సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మహేష్‌ ఇంట్లో వరుస విషాదాల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. వచ్చే వారంలో షూటింగ్‌ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో మహేష్‌కి అక్క పాత్ర కోసం సునీతని అప్రోచ్‌ అయ్యారట త్రివిక్రమ్‌. పాత్ర నచ్చడంతో ఓకే చెప్పిందట. 

అయితే నటిగా అనుభవం లేకపోవడంతో ఆమె కాస్త ఆలోచనలో పడ్డారని, కానీ త్రివిక్రమ్‌ భరోసా ఇవ్వడంతో నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తుంది. మహేష్‌ కి అక్కగా బలమైన పాత్రలో సునీత కనిపించబోతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్‌ ప్లాన్‌కి మాత్రం వాహ్‌ అంటున్నారు అభిమానులు. మరి సింగర్‌గా అద్భుతంగా రాణించిన సునీత నటిగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. 

SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందట. శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రష్మిక చేత స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నారట. ప్రస్తుతం ఇది టాక్స్ లో ఉందని సమాచారం. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.