లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 75వ జయంతి నిన్న ఘనంగా నిర్వచించారు. సోషల్ మీడియా వేదికగా గాన గంధర్వుడు బాలును పరిశ్రమ ప్రముఖులు స్మరించుకున్నారు. సింగర్ గా బాలు జీవితంలో అందుకున్న మైలురాళ్ళు ఎన్నో. మరో ఇతర గాయకుడు సాధించలేని, చేరుకోలేని అరుదైన రికార్డ్స్ ఆయన సొంతం. జీవితంలో 70వేలకు పైగా పాటలు పాడిన మరో సింగర్ ప్రపంచంలోనే ఉండరు. 


బాలుగారిని ప్రతి తెలుగువాడికి దగ్గర చేసిన ప్రోగ్రాం పాడుతా తీయగా. ఈ కార్యక్రమం జడ్జిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన బాలు అనేక గాన కోకిలలను పరిశ్రమకు అందించారు. సంగీత ప్రియులకు ఎనలేని ఆనందం పంచిన పాడుతా తీయగా కార్యక్రమంలో బాలు గారి వివరణ, ఓ పాటకు గురించి ఆయన చెప్పే నేపథ్యం అంటే ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడేవారు. 


2020లో సంభవించిన ఆయన మరణంతో ఐకానిక్ పాడుతా తీయగా భవిష్యత్ సందిగ్ధంలో పడింది. అయితే ఆయన జ్ఞాపకార్థం పాడుతా తీయగా ప్రోగ్రాం ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు నిర్వాహకులు. పాడుతా తీయగా ప్రోగ్రామ్స్ జడ్జెస్ ఎవరో సమాచారం బయటికి వచ్చింది. బాలుగారి కుమారుడైన చరణ్ ఓ జడ్జిగా వ్యవహరించనున్న ఈ షోకి ఆయన శిష్యురాలు సునీతతో పాటు స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ వ్యవహరించనున్నారట.