గాయని మధుప్రియ పోలీసులను ఆశ్రయించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాంగ్‌ కాల్స్ తో తనని వేధిస్తున్నారని ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు శనివారం షీ టీమ్‌కి ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియా ద్వారా తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వస్తున్న బ్లాంక్‌ కాల్స్‌ వివరాలను మధు ప్రియ సైబర్‌ క్రైం పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ  509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

మధుప్రియ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ ఒక్కసారిగా స్టార్‌ సింగర్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమా పాటలు పాడి ఉర్రూతలూగించింది. ఆమె పాడిన `ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని` అంటూ పాడి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. `ఫిదా` సినిమాలో `వచ్చిండే..మెల్లమెల్లగా వచ్చిండే` పాటతో సినీ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మహేష్‌ హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో `హి ఈజ్‌ సో క్యూట్‌` పాటని మధుప్రియనే పాడటం విశేషం. 

సినీ పాటలు, తెలంగాణ పాటలు,జానపద పాటలు పాడుతూ సింగర్‌గా రాణిస్తుంది మధుప్రియా. అయితే ఆ మధ్య తన ప్రేమ, పెళ్లి వ్యవహరం విషయంలోనూ వార్తల్లో నిలిచింది. వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో కాస్త డిస్టర్బ్ అయిన మధుప్రియ అన్ని సమస్యలను అధిగమించి, ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్‌ని పుంజుకునేలా చేస్తుంది.