పాన్ ఇండియా సినిమాలు, కలెక్షన్లపై హీరో సిద్ధార్థ్ షాకింగ్ ట్వీట్.. టార్గెట్ ఆ సినిమానేనా?
వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు సిద్ధార్థ్. ఇప్పుడు ఆయన సినిమాని టార్గెట్ చేశారు. సినిమాల కలెక్షన్ల విషయంలో, పాన్ ఇండియా చిత్రాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హీరో సిద్ధార్థ్ మరో ఫైర్ బ్రాండ్‌గా మారుతున్నారు. ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు. ఆ మధ్య `సమంత డైవర్స్` విషయంలో పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు సిద్ధార్థ్. ఇప్పుడు ఆయన సినిమాని టార్గెట్ చేశారు. సినిమాల కలెక్షన్ల విషయంలో, పాన్ ఇండియా చిత్రాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కలెక్షన్లపై ఆరోపణలు చేశారు.
పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లని తప్పుగా చూపిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ట్విట్ చేశారు. `సినిమాల కలెక్షన్ల రిపోర్ట్స్ ని తప్పుగా చూపించడానికి ఈ రోజుల్లో ఎంత కమీషన్ తీసుకుంటున్నారు. ఎంత రేటు పలుకుతుంది? నిర్మాతలు చాలాకాలంగా బాక్సాఫీసు లెక్కల గురించి అబద్దాలు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడ్ వర్గాలతోపాటు, మీడియా కూడా సినిమా నిర్మాతలు ఇచ్చే అధికారిక గణాంకాలను వెల్లడిస్తున్నారు. ఇది అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఒకేలా ఉంది. పాన్ ఇండియా సినిమాలో నిజాయితీ లేదు` అని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు సిద్ధార్థ్.
అయితే ఆయన ఇప్పుడు ట్వీట్ చేయడానికి కారణమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో కలెక్షన్ల పరంగా బాగా వినిపిస్తున్న `పుష్ప`. ప్రస్తుతం ఇది నాలుగు రోజుల్లో రెండు వందల కోట్లు దాటిందని మంగళవారం జరిగిన `పుష్ప` సక్సెస్‌పార్టీ సెలబ్రేషన్‌లో వెల్లడించారు. ఇప్పుడు ఆ లెక్కలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని టాక్. అయితే ఇది సినిమా నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కలు. కానీ వాస్తవానికి కలెక్షన్లు వేరేలా ఉన్నాయని, అది రూ.150కోట్ల లోపే ఉంటుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే బాలయ్య నటించిన `అఖండ` సినిమా కలెక్షన్ల విషయంలోనూ కొంత తప్పుడు లెక్కలున్నాయని టాక్.
ఇదిలా ఉంటే ఈ రోజు(బుధవారం) సాయంత్రం `పుష్ప` చిత్ర సక్సెస్ పార్టీ చెన్నైలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ట్వీట్ సంచలనంగా మారింది. మరి సిద్ధార్థ్ ఇప్పుడు కామెంట్ చేయడానికి కారణమేంటి? ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక సిద్ధార్త్ ఇటీవల తెలుగులో `మహాసముద్రం` చిత్రంలో నటించారు. `ఆర్ఎక్స్ 100` సినిమా ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్‌తోపాటు శర్వానంద్ హీరోగా నటించారు. అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.