సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసు కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. దీనిపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ ముమ్మరం  చేసింది. ఓ వైపు సుశాంత్‌ కేసులో ప్రధాన నింధితురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిని, ఆమె కుటుంబ సభ్యులను, సుశాంత్‌ తండ్రిని, సోదరిని, సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పిథానిని విచారించారు. 

తాజాగా మంగళవారం సుశాంత్‌ స్నేహితుడు, రూమ్మేట్‌ సిద్ధార్థ్ పిథానిని ఈడీ రెండు సార్లు విచారించింది. గత వారం ఆయన ఈడీ ముందు హాజరు కాగా, మంగళవారం మరోసారి ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ లావాదేవీలకు సంబంధించిన నివేదికలు, ఐటి రికార్డులను సమర్పించాలని కోరింది. ఈ మేరకు సిద్ధార్థ్ అవి సమర్పించారు. నిన్న మధ్యాహ్నానికి ముందే ఈడీ కార్యాలయానికి హాజరైన ఆయన్ని ఈడీ పలు ప్రశ్నలు వేసింది. 

దానికి సిద్ధార్థ్ స్పందిస్తూ, సుశాంత్‌ తనకు డబ్బు ఇస్తే వాటిని చెల్లింపులను చెల్లించేవాడినని, తమ మధ్య పలు ఒప్పందాలున్నాయని తెలిపారు. దీంతోపాటు తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా సిద్దార్థ్ తెలిపినట్టు సమాచారం. మొత్తంగా పలు కీలక  సమాచారం ఈడీ రాబట్టినట్టు తెలుస్తుంది. 

ఇక ఈ మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇందర్‌జిత్‌, సోదరుడు సోయుక్‌, ఆమె సీఏ రితేష్‌షా, ఆమె మాజీ మేనేజర్‌ శ్రుతి మోడీ, అలాగే సుశాంత్‌ సీఏ సందీప్‌ శ్రీధర్‌, అతని హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌, సిద్ధార్థ్‌ పిథాని, సుశాంత్‌ సోదరి మితు సింగ్‌లను కూడా ఈడీ ప్రశ్నించింది. రియా సోదరుడు షోయుక్‌ని మూడు సార్లు విచారించడం గమనార్హం. ఇటీవల రియా ఈడీ ముందు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదట ఆయన రాసిన లెటర్‌ని, వాటర్‌ బాటిల్‌ని ముందుంచింది. ఆ తర్వాత సుశాంత్‌ది సున్నితమైన మనసు అని, ఊరికెనే బయటపడతాడని రియా ఈడీ ముందు తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సుశాంత్‌తో కలిసి తాను యూరప్‌కు వెళ్ళానని, ఓ హోటల్‌లో స్పానిష్‌ చిత్రకారుడు ఫ్రాన్సిస్కోగోయా వేసిన `సాటర్న్ డెవోరింగ్‌ హిజ్‌ ఓన్‌ సన్‌` పెయింటింగ్‌ని చూసి సుశాంత్‌ భయంతో వణికిపోయాడని తెలిపింది. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనంతరం ఆయన తండ్రి కేకే సింగ్‌ మనీ లాండరింగ్‌ జరిగిందని బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.