యూనివర్శల్ హీరో  కమల్‌ హాసన్‌, ప్రముక దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది.  ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. రెండో సారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే ఈ హైప్ ని రెట్టింపు చేయటానికా అన్నట్లు శంకర్ ...హీరో సిద్దార్ద్ ని సీన్ లోకి తెచ్చారు. 

అందుతున్న సమాచారం మేరకు  తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడ‌ట‌. అంతేకాదు ఈ సినిమాలో సిద్ధార్థ్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు చెప్తున్నారు. మేక వన్నె పులి లాంటి పాత్రను సిద్దార్ద చేస్తున్నాడని,. మేక‌ప్ కూడా చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంద‌ని తమిళ మీడియా అంటోంది. 

అతి త్వ‌ర‌లోనే ఈ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర‌ యూనిట్ విడుద‌ల చేయ‌బోతోంద‌ట‌. నెగిటివ్ పాత్రలో  న‌టించ‌డం సిద్ధార్థ్‌కు ఇదే తొలిసారి. ఈ సినిమా తర్వాత తనకు విభిన్నమైన పాత్రలు వస్తాయని భావిస్తున్నాడు. సిద్దార్ద హీరోగా ..శంకర్ డైరక్షన్ లో వచ్చిన బోయ్స్ సినిమాతో పరిచయం అయ్యారు. ఇక‌, ఈ సినిమాలోని క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి సంద‌ర్భంగా చిత్ర‌ యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాజల్ అగ‌ర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.