Asianet News TeluguAsianet News Telugu

కెల్విన్ తెలుసు.. పూరీ ద్వారనే.. శ్యామ్ కె నాయుడు విచారణ పూర్తి

  • డ్రగ్స్ కేసులో శ్యామ్ కె నాయుడు విచారణ పూర్తి చేసిన సిట్
  • కెల్విన్ తో గల సంబంధాలపై ఆరా తీసిన సిట్
  • పూరీ ద్వారానే కెల్విన్ పరిచయమని చెప్పిన శ్యామ్
shyam k naidu sit investigation in drug case finished

టాలీవుడ్ కు పాకిన డ్రగ్స్ స్కాండల్ లింక్స్ పై సిట్ విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు పూరీని విచారించిన సిట్.. రెండో రోజు పూరీ సన్నిహితుడు, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడిని గురువారం ఐదున్నర గంటల పాటు విచారించారు. ఉదయం తన లాయర్, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు.

 

సిట్‌ అధికారుల బృందం ఈ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు దఫాలుగా విచారించారు. డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ఆరా తీశారని తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు విచారించిన అధికారులు నాయుడు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.

 

కెల్విన్‌ ముఠాకు సంబంధించిన వివరాలు, డ్రగ్స్ కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగారని సమాచారం. విచారణ ముగిసిన అనంతరం శ్యామ్‌ కె నాయుడు సిట్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే, కెల్విన్‌తో  ఉన్న సంబంధాలపై... తనకు కెల్విన్ ఈవెంట్ మేనేజర్ లాగానే తెలుసని అంతకు మించి పరిచయం లేదని, అది కూడా పూరీ వల్లనేనని చెప్పినట్లు సమాచారం. కాగా అనుమతి లేకుండా హైదరాబాద్ వదలొద్దని అధికారులు ఆయనకు చెప్పారు.

 

బుధవారం దర్శకులు పూరీ జగన్నాథ్‌ను ట్రీట్ చేసినట్లే సిట్ అధికారులు శ్యామ్ కె నాయుడును కూడా ట్రీట్ చేశారని తెలుస్తోంది. శ్యామ్ డ్రగ్స్‌ కు అలవాటు పడ్డాడే తప్ప, విక్రయదారుడు కాదని గుర్తించారని తెలుస్తోంది. డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకోవడం మానేశారని సిట్ అధికారులు శ్యాంను అడిగారని తెలుస్తోంది. మొత్తంమీద శ్యామ్ కె నాయుడు విచారణకు సహకరించారని సిట్ అధికారులు వెల్లడించారు.

 

మరోవైపు డ్రగ్ కేసు ఆషామాషీ కేసు కాదని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. నోటీసులు అందుకున్న వారు సిట్ విచారణకు హాజరైతే దర్యాఫ్తు వేగవంతమవుతుందన్నారు. డ్రగ్ కేసును చాలా లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు లభిస్తే ఎవరిపై అయినా చర్యలు వుంటాయని అన్నారు. ఈవాళ మూడు కొరియర్ సంస్థలతో సమావేశమయ్యామని తెలిపారు. డ్రగ్స్ డెలివరీని అరికట్టాలని చెప్పామన్నారు. ఆరుగురితో కూడిన సిట్ బృందం శ్యామ్ కె నాయుడిని ప్రశ్నించిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios