దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన నటి శృతిహాసన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. కొంతకాలం పాటు లండన్ కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ ఇటీవల బ్రేకప్ చేసుకుంది. అయితే తన లైఫ్ లో ఇది రెండో రిలేషన్షిప్ అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తన జీవితంలో వేర్వేరు కాలాల్లో ఇద్దరితో ప్రేమలో ఉన్నట్లు శృతి వెల్లడించింది. వాటి నుండి ఎందుకు బయటకి రావాల్సివచ్చిందో వివరించింది. తొలిసారి రిలేషన్షిప్ లో  ఉన్నప్పుడు ఆ విషయం బయటకి చెప్పడానికి భయపడిందట. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని అనిపించిందని.. ఆ రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదని చెప్పింది.

ఆ తరువాత కొన్నేళ్లకు ఓ బంధంఏర్పడిందని.. ఈసారి ఎందుకు బయటకి చెప్పకూడదని.. అందరికీ చెప్పేసినట్లు తెలిపింది. తనలా ఓపెన్ గా చెప్పడాన్ని చాలా మంది  మెచ్చుకున్నారని వెల్లడించింది. జీవితాంతం కొనసాగించాలనే ఏ రిలేషన్ అయినా మొదలుపెడతామని.. అలానే ఈ బంధం కూడా మొదలైందని.. అది కుదరనప్పుడు ఏం చేయగలమని ప్రశ్నించింది. 

అందుకే ఆ బంధాన్ని తెంచుకున్నట్లు చెప్పింది. ఆ బంధం మొదలైనందుకు హ్యాపీ ఫీలయ్యానని.. ముగిసిపోయినప్పుడూ ఆనందపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను సింగిల్ గా ఉన్నట్లు.. ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలు లేకుండా కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు వెల్లడించింది.