సినిమా తారలు గ్రీన్‌ ఛాలెంజ్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌కి విశేష ఆదరణ లభిస్తుంది. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో సినీ సెలబ్రిటీలు భాగం కావడంతో మరింతగా ఊపందుకుంది. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, నాగార్జున, సమంత వంటి స్టార్స్ పాల్గొని మొక్కలు నాటారు. అదే సమయంలో మిగతా స్టార్స్ ని ఉత్తేజ పరిచారు. 

అందులో భాగంగా ఇటీవల మహేష్‌బాబు తన బర్త్ డే రోజున గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తమిళ దళపతి విజయ్‌, ఎన్టీఆర్‌లకు సవాల్‌ విసిరాడు. ఇప్పటికే వారు స్పందించారు. నిన్న విజయ్‌ మొక్కలు నాటి ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందుకు మహేష్‌ సైతం ధన్యవాదాలు తెలిపారు. 

మహేష్‌తోపాటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటింది. అంతేకాదు తనని నామినేట్‌ చేసినందుకు మహేష్‌కి, దేవికి కృతజ్ఞతలు తెలిపింది. తన వంతుగా మరో ముగ్గురిని ఎంపిక చేసింది. బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, ఇటీవలే కొత్తగా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టిన రానా, అలాగే తోటి నటి, మిల్కీబ్యూటీ తమన్నాకి సవాల్‌ విసిరింది.

ఇక రెండేళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన ఈ హాట్‌ భామ గతేడాది రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రవితేజ సరసన `క్రాక్‌`తోపాటు  పవన్‌కి మూడోసారి జోడిగా `వకీల్‌ సాబ్‌`, అలాగే తమిళంలో `లాభం` చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇటీవల సొంతంగా ఓ వీడియో సాంగ్‌ని రూపొందించి మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే.