ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరక్షన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్, ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ డైసీ ఎడ్గర్‌  ఖరారు చేసి ప్రకటన విడుదల చేసారు. అయితే ఇంతలో డైసీ ఎడ్గర్‌ చిత్రం నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకుంది. అప్పటి నుంచి చిత్ర యీనిట్ ఎన్టీఆర్‌ సరసన నటించే హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు.

బాలీవుడ్‌ నుంచి శ్రద్ధా కపూర్, పరిణితీ చోప్రాలను పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఇద్దరూ నో చెప్పేసారని బాలీవుడ్ వర్గాల సమాచారం. శ్రద్దా ఇప్పటికే ప్రభాస్‌ సరసన ‘సాహో’లో చేస్తుంది. ఆమె ను తీసుకుందామనుకుంటే..వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గత రెండు నెలలుగా ఆమె వరస సినిమాలు సైన్ చేసింది. రాజమౌళి టీమ్ ఎప్రోచ్ అయితే తన షెడ్యూల్స్ వివరాలు చెప్పి, వచ్చే సంవత్సరం దాకా ఖాళీ లేదని అన్నదట. 

సరే అని పరిణితీ చోప్రా దగ్గరకు వెళ్తే ఆమె  ఇప్పుడిప్పుడే డెంగ్యూనుంచి పూర్తిగా కోలుకుని తన తదుపరి చిత్రం సైనా నేహ్వాల్ బయోపిక్ కు సంభందించిన పనుల్లో పడుతోంది. ఇందుకోసం ఆమె కొద్ది కాలం పాటు ట్రైనింగ్ కు కూడా వెళ్తోంది. దాంతో తాను తన కాన్సర్టేషన్ ని పూర్తిగా ఆ బయోపిక్ పై పెట్టానని చెప్పి  నో చెప్పటంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ మరో హీరోయిన్ ని అన్వేషించాలని  ఫిక్సైయ్యారట.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి  సంగీతం అందిస్తున్నారు.  ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రమిది కావడం విశేషం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ను గొప్పగా తీస్తున్నామని ఇటీవల రాజమౌళి ఓ మీటింగ్ లో  చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ నటులు వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌ను ఈ చిత్రంలోని కీలక పాత్రలకు దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నటిస్తామని వారు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.