ప్రస్తుతం ఎక్కడ చూసినా సినీ అభిమానుల్లో ప్రభాస్ సాహో చిత్రం గురించే చర్చ జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగింది. బాలీవుడ్ హీరోలని తలదన్నే మార్కెట్ ప్రభాస్ కు ఏర్పడింది. ఇటీవల విడుదలైన సాహో టీజర్ తో ఆ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగాయి. మునుపెన్నడూ చూడని విధంగా సాహోలో యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బురపరిచే విధంగా ఉండబోతున్నాయి. 

ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్దా కపూర్ పాత్రలపై స్పష్టమైన సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. తాజాగా శ్రద్దా కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. పోలీసులు దేశం కోసం ఎంతో చేస్తున్నారు. అలాంటి పాత్రలో సాహోలో నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు శ్రద్దా కపూర్ తెలిపింది. 

దీనితో శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం ఖరారైంది. సాహో టీజర్ లో కూడా శ్రద్దా ప్రభాస్ తో కలసి యాక్షన్ సన్నివేశాల్లో కనిపించింది. దీనితో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనే అంశం అభిమానులని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.