యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతోంది. 

బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సాహో చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండడంతో ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని ముందుగానే అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ శ్రద్దా కపూర్ కాదట. 

బాలీవుడ్ మెరుపుతీగ కత్రినా కైఫ్ ని ప్రభాస్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ కత్రినా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాకయ్యారు. సాహో చిత్రం కోసం కత్రినా ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందట. దీనితో కత్రినాని పక్కన పెట్టి శ్రద్దా కపూర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో అమృత నాయర్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది.