గతేడాది `సాహో`తో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసిన బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని కొట్టేసింది. పాపులర్‌ పాత్రలో కనిపించబోతుంది. చాలా శక్తివంతమైన పాత్రలో నటించబోతుంది. `నాగిని`గా మెస్మరైజ్‌ చేయబోతుంది. 

విశాల్‌ ఫురియా దర్శకత్వంలో, నిఖిల్‌ ద్వివేది నిర్మిస్తున్న ట్రయాలజీ చిత్రంలో నటించబోతుంది. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి నటించిన `నాగిని`గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. `చిన్నప్పటి నుంచి శ్రీదేవి `నాగినా, `నాగినా 2` సినిమాలను చూస్తూ పెరిగాను. `నాగిని`గా శ్రీదేవి నటన ఓ ల్యాండ్‌మార్క్ గా నిలిచిపోయింది. సాంప్రదాయ జానపద చిత్రాలకు నాంది పలికిన అలాంటి శక్తివంతమైన పాత్రతో తెరపై కనిపించబోతున్నందుకు ఆనందంగా ఉంది` అని ట్వీట్‌ చేసింది శ్రద్ధా. శ్రద్ధా ఈ ఏడాది `బాఘి 3`, `స్ట్రీట్‌ డాన్స్ 3డి` చిత్రాలతో మెప్పించబోతుంది.