వివాహానంతరం   విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రం ఓ బేబీ. డబ్బై ఏళ్ల వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌ చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధించారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్‌ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.బేబీ పాత్రలో సమంత మెప్పించిందంటూ అంతటా ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ లో ఈ  సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. 

యుఎస్ లో  ఈ సినిమా కేవలం ప్రీమియర్‌లో 1,45,135 డాలర్లు రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు(ప్రీమియర్‌) సాధించిన ఆరో చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. 

బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించటం కలిసివచ్చింది. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్‌ ఇచ్చింది. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్‌ అయ్యారని మీడియా మొత్తం ముక్త కంఠంతో అంటోంది.  

ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేసాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ .