Shiva Shankar master:సాయం అందినా దక్కని ప్రాణం... శివ శంకర్ మృతి తీరని విషాదం
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.మహమ్మారి కోవిడ్ తో పోరాడుతూ శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు విడిచారు. పది భాషల్లో 800 వందల చిత్రాలకు పైగా చిత్రాలకు పని చేసిన శివ శంకర్ మాస్టర్ జీవితం ముగిసిన తీరు అందరినీ కలచివేసింది.
కొరియోగ్రాఫర్ గా అత్యున్నత శిఖరాలు అందుకున్న శివ శంకర్ మాస్టర్ (Shiva Shankar master)వారం రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వైద్య ఖర్చులకు కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో చేసేది లేక పరిశ్రమ సాయం చేయాలంటూ సోషల్ మీడియా అభ్యర్ధన చేశారు. పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రూ. 3 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. అలాగే హీరో ధనుష్ రూ. 10 లక్షలు విరాళం గా ఇచ్చారు.
అయితే అప్పటికే ఆయన పరిస్థితి చేయి దాటింది. క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన వయసు రీత్యా మహమ్మారిని ఎదిరించలేక పోయారు. నేడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శివ శంకర్ మాస్టర్ మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
సకాలంలో శివ శంకర్ మాస్టర్ కి వైద్యం అంది ఉంటే కోలుకునేవారేమో. కారణం ఏదైనా చిత్ర పరిశ్రమ ఓ గొప్ప డాన్సర్ ని కోల్పోవడం బాధాకరం. చిన్నతనంలో జరిగిన ప్రమాదం వలన వెన్నుకు గాయమైతే ఆయన నడవడమే కష్టం అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లు మంచానికే పరిమితమైన ఆయన అంగవైకల్యాన్ని జయించాడు. విధిని ఎదిరించి డాన్సర్ గా ఎదిగిన శివ శంకర్ మాస్టర్ కోవిడ్ తో పోరాడలేక సెలవు తీసుకున్నారు.
Also read Sivasankar Master Death: శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. కరోనా బారినపడి, మృత్యువుతో పోరాడి ఓడిన ప్రతిభాశాలి
కొరియోగ్రాఫర్ గానే కాకుండా నటుడిగా కూడా రాణించిన శివ శంకర్ మాస్టర్ 30కి పైగా చిత్రాలలో నటించారు. మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్ కి గాను ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతదేహానికి రేపు మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసంలో అభిమానుల సందర్శనార్థం శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించనున్నారు.
శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ చేశారు ఏఐజీ వైద్యులు. రేపు ఉదయం 5 గంటలకు శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.