నాగచైతన్య నటించిన `కస్టడీ` చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఇది నాగార్జునకి `శివ` ఎంతటి బ్రేక్‌ ఇచ్చిందో, నాగచైత్యకి `కస్టడీ` అలాంటి సినిమా అవుతుందని చెప్పారు నిర్మాత.

అక్కినేని నాగచైతన్య కెరీర్‌ ప్రారంభించి పదమూడేళ్లు అవుతున్నా, ఇంకా యంగ్‌ స్టర్‌గానే రాణిస్తున్నాడు. ఇటీవల కాలంలో సరైన బ్రేక్‌ రావడం లేదు. `మజిలి` హిట్‌ అనిపించుకున్నా చాలా వరకు క్రెడిట్‌ సమంత తీసుకెళ్లింది. `బంగార్రాజు` సినిమా కూడా ఓ మోస్తారుగానే ఆడింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ గా చెప్పుకునే హిట్‌ పడటం లేదు. ఈ నేపథ్యంలో చైతూకి ఓ బ్రేక్‌ కావాల్సి ఉంది. హీరోగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేందుకు ఆయనకు సరైన బ్రేక్‌ రావాలి. మరి అది `కస్టడీ`తో సాధ్యమవుతుందా? అంటే సాధ్యమే అంటున్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. 

నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో ఆయనకు `శివ` చిత్రం ఎలా అయితే బ్రేక్‌ ఇచ్చిందో, కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అయ్యిందో, ఇప్పుడు నాగచైతన్యకి కూడా `కస్టడీ` అలాంటి సినిమా అవుతుంది. ఆయన కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుందని తెలిపారు. తాజాగా బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ చిట్టూరి మాట్లాడుతూ, పై విధంగా స్పందించారు. మరో `శివ`లాంటి సినిమా అవుతుందన్నారు. సినిమాపై ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెప్పారు. తెలుగు, తమిళ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలున్నాయని, రెండింటిని దర్శకుడు వెంకట్‌ ప్రభు బ్యాలెన్స్ చేశారని తెలిపారు. నాగచైతన్య కొత్త లుక్‌లో కనిపిస్తారని, ఆయన అందరిని ఆకట్టుకుంటారని తెలిపారు. 

`కస్టడీ`లో రా, సెన్సిబిలిటీస్‌, ఎమోషన్స్, సీరియస్‌ నెస్‌ ఉంటుందన్నారు. నాలుగు సర్‌ప్రైజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ఉంటాయని, హాలీవుడ్‌ స్టయిల్‌లో ఉంటాయని చెప్పారు. హాలీవుడ్‌ మూవీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుందన్నారు. 1990 ప్రారంభంలో రూరల్ పోలీస్ స్టేషన్ లోని ఒక నిజాయితీ గల పోలీస్‌ కానిస్టేబుల్ కథ. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పారు. అండర్‌ వాటర్‌ ఎపిసోడ్స్ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉంటాయని చెప్పారు. కథపై నమ్మకంతో నాగచైతన్య మార్కెట్‌కి మించి ఖర్చుపెట్టామని, అంతకు మించి వస్తుందని నమ్ముతున్నాం. బిజినెస్‌ అయిపోయింది. ప్రాజెక్ట్ పరంగా హ్యాపీగానే ఉన్నామని తెలిపారు నిర్మాత. అంతేకాదు `కస్టడీ2` కూడా ఉంటుందని, అది సినిమా రిజల్ట్ ని బట్టి ఉంటుందని తెలిపారు. 

నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి సంబంధించిన 90శాతం షూటింగ్‌ పూర్తయ్యిందట. రామ్‌ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ వస్తాయని, ఆ తర్వాత టైటిల్‌ని అనౌన్స్ చేస్తామని తెలిపారు. తెలుగు టైటిలే ఉంటుందన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న సినిమాని రిలీజ్‌ చేస్తామని తెలిపారు. ఈ సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా, నాగచైతన్యతో మరో సినిమా చేయబోతున్నామని ప్రకటించారు. ఇక నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రియమణి, అరవింద్‌ స్వామి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మించారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాఈ నెల 12న విడుదల కాబోతుంది.