చివరి అంకానికి చేరుకున్న బిగ్ బాస్ షో బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేసిన హీరో సునీల్  ఎలిమినేషన్ టెన్షన్ లో ఇంటి సభ్యులు

బుల్లితెరపై సందడి చేస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్.. చివరి అంకానికి వచ్చేసింది. బిగ్'బాస్ 61వ ఎపిసోడ్‌లో సినీ హీరో సునీల్ సందడి చేశారు. ఉంగరాల రాంబాబు చిత్రం విడుదల సందర్భంగా గురువారం నాటి ఎపిసోడ్‌లోనే సునీల్ బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాడు. ఇక దీక్షాను మిగతా ఐదుగురు కంటెస్టెంట్లు కార్నర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ వారం దీక్షా, హరితేజ, ఆదర్శ్, అర్చన ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆడియన్స్ పోలింగ్ ప్రకారం.. ఈ వారం దీక్ష ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక వేళ ఇద్దరు ఎలిమినేట్ అయితే.. దీక్షతోపాటు అర్చన కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.

బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో హీరో సునీల్ చాలా సరదాగా గడిపారు. సునీల్ కోసం వేడి వేడి పకొడీలు చేసి ఆతిథ్యం ఇచ్చారు. పకొడీలను చూసి చిన్నతనంలో తన అమ్మమ్మ చేసే పకొడీలను ఈ సందర్భంగా సునీల్ గుర్తు చేసుకొన్నారు. ఇంటికి సంబంధించిన రేషన్ గురించి అడిగి తెలుసుకొన్నారు. ఉంగరాల రాంబాబు సినిమాకు సంబంధించిన విశేషాలను వారికి వివరించారు.

ఇంటి సభ్యుల మనసులోని భావాలు, ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయాలను ఓ టాస్క్ రూపంలో సునీల్ అడిగి తెలుసుకొన్నారు. ఇంటి సభ్యులు తమ పోటీదారుల గురించి మంచి చెడులను వివరించారు. ముఖ్యంగా దీక్షను మిగితా వారంతా ఆటపట్టించేందుకు ప్రయత్నించారు. ఆటపై స్పష్టమైన వైఖరిని కనబరచని దీక్షా మిగితా సభ్యుల కామెంట్లను వినుకుంటూ కూర్చున్నది. ఆ తర్వాత కొద్ది సేపటికి సునీల్ ఇంటి నుంచి నిష్క్రమించారు.

సునీల్ నిష్క్రమణ తర్వాత ఇంటిలో దీక్షా, అర్చన మధ్య ఎప్పటిలానే చిన్న వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీక్షా తప్పులు ఎత్తి చూపి నిలదీసినప్పుడల్లా చిరాకు పడుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ అర్చన, హరితేజలు తమకేం తెలియదన్నట్లు మేనేజ్ చేయటం కనిపించింది. పోట్లాటలు, సరదాలతో ఎపిసోడ్ ఫర్వాలేదనిపించే విధంగా నడిచింది.

బిగ్‌బాస్ హౌస్‌లో 61 రోజులు గడిపిన సెలబ్రిటీలను ఇంటిలో వారికి నచ్చిన ప్రదేశాల గురించి వివరించమని బిగ్‌బాస్ కోరారు. అయితే వారు తమకు నచ్చిన ప్రదేశాల గురించి ప్రతి ఒక్కరు వివరించారు. ఎక్కువ మంది తమకు కిచెన్ ఇష్టం అని తెలుపారు. బాత్రూం నాకు నచ్చిన ప్లేస్ అని ఆదర్శ్, బెడ్ రూం నాకు చాలా ఇష్టం అని అర్చన తెలిపారు. ఇక శివబాలాజీ నాకు స్మోక్ రూమ్ అంటే ఇష్టం అని తెలుపడం గమనార్హం.

బిగ్‌బాస్ హౌస్‌లో శివ బాలాజీ, అర్చన మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అర్చన వీపు మీద శివబాలాజీ బత్తాయిలతో మసాజ్ చేయడం గమనార్హం. మసాజ్ చేసుకొంటూ అర్చన ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇక హౌస్‌లో ఎవరి పనుల్లో వారు ఉండగా హరితేజ, అర్చన బాత్రూంలో దూరారు. ఇది గమనించిన శివ బాలాజీ, దీక్ష వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కర్టెన్ చాటు నిలబడి ఆసక్తిగా గమనించారు. హరితేజ, అర్చన ఇద్దరూ దీక్ష గురించి చాడీలు చెప్పుకోవడం ప్రారంభించారు. అలా కాసేపు మాట్లాడుకొన్న తర్వాత కర్టెన్ వెనుక ఉన్న శివబాలాజీని, దీక్షను చూసి హరితేజ షాక్ అయింది.

హరితేజ, అర్చన బయటకు కనిపించే విధంగా ఓ పక్క సన్నిహితంగా ఉంటూనే తనపై కామెంట్లు చేసిన తీరుకు దీక్ష నొచ్చుకొన్నది. తనపై చూపిస్తున్న ప్రేమ అంతా ఉత్తిదే అనే భావనకు దీక్ష వచ్చింది. వారిద్దరి ప్రవర్తను దీక్ష నొచ్చుకొని నిద్రకు ఉపక్రమించింది. శనివారం జరిగే ఎపిసోడ్‌లో ఎవరు బిగ్‌బాస్ ఇంటి నుంచి నిష్క్రమిస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం తుది అంకానికి చేరుకొన్నది. గ్రాండ్ ఫినాలే వారం మొదలైంది. వచ్చేవారం ప్రారంభంలో విజేత ఎవరో అనే విషయం తేలుతుంది. 50 లక్షల బంపర్ ప్రైజ్ ఎవరిని వరిస్తుందో అనే అంశం ప్రేక్షకుల్లో చర్చనీయాంశమవుతోంది.