సాగర కన్య శిల్పా శెట్టి ఫ్యామిలీ కూడా కరోనాకి గురైందట. దాదాపు పది రోజులు చుక్కలు చూశామని చెప్పింది శిల్పా శెట్టి. ప్రస్తుతం వారందరు కోలుకున్నారని, ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నామని చెప్పింది. తాజాగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో శిల్పా శెట్టి చెబుతూ, `గత పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మా అత్తమామ, మా అమ్మ, చివరికి రాజ్‌(భర్త రాజ్‌కుంద్రా)కి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారంతా ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇంట్లో పనిచేసే ఇద్దరు పనివాళ్లకి కూడా కరోనా వచ్చింది. వారు కూడా ఐసోలేట్‌ అయ్యారు. ఇక నాకు మాత్రమే నెగటివ్‌ వచ్చింది. 

వైద్యులు, ఆధికారుల సూచనల మేరకు, కరోనా నిబంధనలన్నీ పాటించాం. పది రోజులు చాలా ఇబ్బందికర పరిస్థితులను చవిచూశాం. దేవుడి దయవల్ల ఇప్పుడు అందరు కోలుకున్నారు. ఈ సందర్భంగా ముంబై మూన్సిపాలిటీ కమిషన్‌ అధికారులకు ధన్యవాదాలు. మమ్మల్ని టేక్‌ కేర్‌ చేస్తూ తగిన విధంగా గైడ్‌ చేసి సహాయం చేశారు. అలాగే అభిమానులందరికీ ధన్యవాదాలు. మా కోసం ప్రార్థించిన వారందరికి రుణ పడి ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా` అని పేర్కొంది శిల్పా శెట్టి.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే మాస్క్, శానిటైజర్‌ వాడడం తప్పసరిగా పాటించాలని సూచించింది. కోవిడ్‌ పాజిటివ్‌, నెగిటివ్‌ అయినా ప్రతి ఒక్కరూ మానసికంగా పాజిటివ్‌గా ఉండాలంటూ సందేశం ఇచ్చింది. కాగా శిల్పా శెట్టి-రాజ్‌ కుంద్రా దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, ఏడాది కూతురు ఉన్న సంగతి తెలిసిందే. శిల్పా శెట్టి తెలుగులో `సాహసవీరుడు సాగర కన్య`, `భలేవాడివి బాసు`, `అజాద్‌`, `వీడెవడండి బాబు` వంటి  చిత్రాల్లో నటించింది.